హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లో ఓపెనర్లుగా స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్లు బరిలోకి దిగే విషయం మనకు తెలిసిందే. మరికొన్ని సందర్భాల్లో అల్ రౌండర్లు సైతం ఓపెనర్లుగా రావడం మనం చూశాం. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.
లీగ్‌లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్ స్టార్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికైంది. వెస్టిండిస్ స్పిన్నర్ సునీల్ నరేన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయలేదు. అయితే టీ20ల్లో మాత్రం ఐదో స్ధానంలో నాలుగు సార్లు మాత్రమే బ్యాటింగ్ చేశాడు.
అయితే మెల్‌బోర్న్ స్టార్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్ డేవిడ్ హస్సీ బౌలింగ్ ఎంచుకున్నాడు. మెల్‌బోర్న్ రెనెడేడ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండిస్ స్పిన్నర్ సునీల్ నరైన్, ఆరోన్ ఫించ్‌తో ఓపెనర్‌గా వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన నరైన్ 13 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 21 పరుగులు చేశాడు. ఆ తర్వాత 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ స్టార్స్ 18 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసిన సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేశారు.
కాగా మ్యాచ్ నిలిపి వేసే సమయానికి 7 పరుగుల వెనుకబడి ఉన్న మెల్‌బోర్న్ స్టార్స్ డక్ వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం ఓటమి పాలైంది. 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన హగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.