
అబుదాబి: వెస్టిండీస్ స్టార్ పేసర్ సునీల్ నరైన్ అత్యుత్తమ టీ20 బౌలర్ అని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మెంటార్ డేవిడ్ హస్సీ ప్రశంసలు కురిపించాడు. నరైన్ నైట్‌రైడర్స్ జట్టులో ఉండడం తమ అదృష్టమన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా అత్యుత్తమ బౌలింగ్ చేసే బౌలర్ కొనియాడాడు. సునీల్ నరైన్ నైట్‌రైడర్స్ తరపున అటు ఓపెనర్‌గానూ, ఇటు ప్రధాన స్పిన్నర్‌గాను కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డేవిడ్ హస్సీ మాట్లాడుతూ... 'సునీల్ నరైన్ ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బౌలర్. ఏ పరిస్థితులలోనైనా బాగా బౌలింగ్ చేస్తాడు. ఉత్తమ ఆటగాళ్లలో నరైన్ ఒకడు. కేకేఆర్ జట్టులో నరైన్ ఉండటం మా అదృష్టం. నరైన్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడు. బౌలింగ్‌లో స్పిన్ మ్యాజిక్‌తో కీలక వికెట్లు తీస్తూ మంచి బ్రేక్ ఇస్తూ ఉంటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎక్కడైనా బ్రేక్ ఇవ్వడంలో నరైన్‌ది ప్రత్యేక స్థానం' అని అన్నాడు.
'జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉంటే కెప్టెన్ దినేశ్ కార్తీక్‌కు వెంటనే గుర్తుచ్చొ బౌలర్ సునీల్ నరైన్. ఈసారి ఐపీఎల్‌లో కూడా నరైన్‌దే కీలక పాత్ర. హోరాహోరీ పోరులో నరైన్‌దే పైచేయి అవుతుంది.యూఏఈలో స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటం నరైన్‌కు కలిసొచ్చే అంశం' అని డేవిడ్ హస్సీ తెలిపాడు. కేకేఆర్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ నరైన్. 119 మ్యాచ్‌ల్లో 140 వికెట్లు సాధించాడు. తాజాగా ముగిసిన సీపీఎల్ 2020లో సునీల్ నరైన్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడాడు. ఇక యూఏఈకి పయనం కానున్నాడు.
గతేడాది ఐపీఎల్‌లో సునీల్ నరైన్ 12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లో 166.27తో 143 పరుగులు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. గౌతం గంభీర్ సారథ్యంలో కేకేఆర్ 2012, 2014ల్లో టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఆ తర్వాత 2016, 17, 18ల్లో ప్లేఆఫ్స్‌కు చేరినా టైటిల్‌ను మాత్రం సాధించలేకపోయింది. అంతర్జాతీయ కెరీర్‌లో నరైన్ ఇప్పటివరకు 6 టెస్టుల్లో, 65 వన్డేల్లో, 51 టీ20 మ్యాచ్‌ల్లో విండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.