ఇషాన్ ఈ ఆటిట్యూడ్ పనికిరాదు.. ఇలాగైతే నిన్ను కుందేలు పిల్లలా ఆడుకుంటారు

ఇండియన్ ప్రీమియర్ లీగ్(2022)లో ఎనిమిది పరాజయాల పరంపరతో ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోంది. వారి బౌలింగ్, బ్యాటింగ్ ఏమాత్రం అనుకున్నంత పటిష్టంగా లేదు. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నా ఫలితం లేకుండా పోతుంది.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆదివారం తన నిరాశజనక ప్రదర్శన కనబరిచిందంటూ భారత మాజీ కెప్టెన్, క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అన్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలో ఇషాన్ కిషన్ ఆడే విధానం పట్ల చాలా నిరుత్సాహం చెందుతున్నట్లు పేర్కొన్నాడు.

ఇషాన్‌కు ఎందుకింత తడబాటు
ఐపీఎల్లో భారీ మొత్తానికి ఇషాన్ కిషన్‌ను ముంబై కొనుగోలు చేసింది. అతను తొలి రెండు మ్యాచ్‌లలో బ్యాక్ టు బ్యాక్ ఫిఫ్టీలు సాధించి ఇంకా తను టచ్‌లో ఉన్నట్టే కన్పించింది. కానీ తర్వాతి మ్యాచ్‌లలో ఇషాన్ ప్రదర్శన నానాటికీ దిగజారిపోతుంది. ఆదివారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ 20బంతుల్లో కేవలం 8పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మంచి షాట్లతో ఛేజింగ్‌ను ప్రారంభించగా.. మరో వైపు ఇషాన్ చాలా తడబడుతూ ఆడాడు. పవర్‌ప్లేలో అతను ఎదుర్కొన్న 17బంతుల్లో కేవలం 6పరుగులు మాత్రమే చేశాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ముంబై వికెట్ నష్టపోకుండా 43పరుగులు చేసింది. ఎనిమిదో ఓవర్లో రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఇషాన్ విచిత్రంగా ఔటయ్యాడు. అనవసరంగా వైడ్ వెళ్లే బంతిని షాట్ కొట్టగా అది కట్ అయి కీపర్ క్వింటన్ డికాక్ బూట్‌కు తాకి బౌన్స్ అయింది. దాన్ని స్లిప్‌లో ఉన్న జాసన్ హోల్డర్ అందుకున్నాడు.

ఔట్ కంటే.. అతని మెంటాలిటీయే నిరాశపర్చింది
ఇషాన్ దయనీయమైన బ్యాటింగ్, ఔటయిన విధానం కంటే.. అతని మానసిక వైఖరే తనను నిరాశకు గురిచేసిందని సునీల్ గవాస్కర్ అన్నాడు. 'ఇషాన్ ఔటయ్యాక అంపైర్ రెఫరల్ కోసం వేచి ఉండలేదు. ఔటయినట్లు భావించి పెవిలియన్ వైపు నడిచాడు. అంపైర్ ఆపేదాకా ఆగలేదు. అతను పూర్తిగా దయనీయంగా కన్పించాడు.
తనకు బ్యాడ్ టైం ఉందన్న ఫీలింగ్లో అది ఔటే అయి ఉంటుందన్నట్లు పెవిలియన్ బాట పట్టాడు. ఎవరైనా అలా ఔటయినప్పుడు అది ఔటో కాదో తెలుసుకోవడానికి వేచిచూస్తారు. కానీ ఇషాన్ పరిస్థితి వేరేలా ఉంది. అతను నాటౌట్ కావొచ్చనే విషయంలో ఆసక్తి లేకుండా కన్పించాడు. అతని మానసిక పరిస్థితి, ఆటిట్యూడ్ ఏం బాలేదు' అని గవాస్కర్ అన్నాడు.

ఆస్ట్రేలియాలో బ్యాటింగ్ చేయడం కష్టం
అలాగే షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో సమర్థంగా ఆడలేకపోతున్న ఇషాన్ వైఖరిని సైతం సునీల్ గవాస్కర్ ప్రస్తావించాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేయడం కష్టమని చెప్పాడు. 'ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి పిచ్‌లలో ప్రదేశాలలో అదనపు బౌన్స్ ఉంటుంది.
అక్కడి బౌలర్లు షార్ట్ పిచ్ బంతులను సమర్థంగా వేయగలరు. షార్ట్ పిచ్ బంతులను ఇషాన్ ఎదుర్కోలేకపోతే హెడ్‌లైట్‌లో చిక్కుకున్న కుందేలులాగా అతని పరిస్థితి ఉంటుంది. ప్రతి ఫాస్ట్‌బౌలర్ ఇషాన్ బలహీనతను ఆసరాగా చేసుకుని అలాంటి బంతులే వేసి తిప్పలు పెడతారు. అతను నడుము కంటే కిందకు వచ్చే బంతులను హిట్ చేస్తాడు కాబట్టి తెలివిగా.. షార్ట్ పిచ్ బంతులతో అతన్ని ఇబ్బందిపెడతారు.' అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications