
హైదరాబాద్: సునీల్ గవాస్కర్... భారత క్రికెట్‌కు తొలి సూపర్ స్టార్. అభిమానులు ముద్దుగా సన్నీ అని పిలుచుకునే సునీల్ గవాస్కర్ మంగళవారం 69వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఎంతోమంది యువ క్రికెటర్లకు సునీల్ గవాస్కర్ రోల్ మోడల్‌గా నిలిచాడు.
అంతేకాదు టెస్టు క్రికెట్‌లో 10,000 పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ గవాస్కర్‌ను అధిగమించనంతవరకు చాలా ఏళ్లపాటు ఈ రికార్డు అతడి పేరిటే ఉంది.
అరంగేట్రం చేసిన టెస్టు సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటికీ సునీల్ గవాస్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో వెస్టిండిస్ జట్టుపై అరంగేట్రం చేసిన సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేశాడు. 70, 80 దశకాల్లో ఫాస్ట్ బౌలర్లను భయం లేకుండా ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్లలో సునీల్ గవాస్కర్ ఒకడు.
తన డిఫెన్సివ్ టెక్నిక్‌తో మాజీ ఫాస్ట్ బౌలర్లు మైకేల్ హోల్డింగ్, ఆండీ రాబర్డ్స్, మాల్కమ్ మార్షల్, కొలిన్ క్రాఫ్ట్, జోయల్ గార్నెర్‌లతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సునీల్ గవాస్కర్ ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహారిస్తున్నారు. సునీల్ గవాస్కర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.