
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌పై పోరాటానికి తన వంతు సాయంగా రూ.59 లక్షలు విరాళంగా ఇవ్వగా.. తాజాగా 35 మంది పిల్లల గుండె చికిత్సకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకువచ్చారు. శుక్రవారం 71వ పుట్టిన రోజు సందర్భంగా పేద పిల్లల పట్ల సహృదయత కనబరిచారు లిటిల్ మాస్టర్.
గుండె జబ్బుతో బాధపడుతున్న 35 మంది పిల్లల చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును భరిస్తానంటూ శుక్రవారం సునీల్ గవాస్కర్ ముందుకొచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌లో గవాస్కర్ చేసిన సెంచరీలకు ఇది సమానం. గతేడాది 34 మందికి సహాయమందించిన సన్నీ.. ఈసారి అదే పద్దతిని ఫాలో అయ్యారు. గవాస్కర్ ఆర్థిక సహాయంతో ముంబైలోని శ్రీ సత్యసాయి సంజీవని దవాఖానలో హృద్రోగ చిన్నారులకు త్వరలోనే చికిత్స అందనుంది.
ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ మీడియాతో మాట్లాడుతూ... 'ఏదైనా సహాయమందించడానికి చాలా ఉన్నాయి. ఇందులో చిన్నారులకు ఎప్పుడు ప్రత్యేక స్థానముంటుంది. ప్రతి కుటుంబానికి పిల్లలు ఆశాకిరణాలు. దేశంలో పుట్టుకతోనే హృద్రోగ సమస్యలు ఎదుర్కొనే చిన్నారులు చాలా మంది ఉండటం బాధాకరం. పుట్టిన రోజున పిల్లల కోసం ఏదైనా చేయాలనిపించింది. అందుకే ఈ చిన్న సాయం చేస్తున్నా' అని తెలిపారు.
గత ఏప్రిల్ నెలలో కరోనా వైరస్‌పై పోరాటానికి తన వంతు సాయంగా సన్నీ రూ.59 లక్షలు విరాళంగా ఇచ్చారు. దీనిలో రూ.35 లక్షలు పీఎం కేర్స్‌కు, రూ.24 లక్షలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. 1971 నుంచి 1987 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గావస్కర్.. మొత్తం 35 సెంచరీలు చేశారు. ఇందులో 34 సెంచరీలు టెస్టు ఫార్మాట్‌లో, ఒక సెంచరీ వన్డే ఫార్మాట్‌లో చేశారు. మొత్తం 35 సెంచరీలకు సంఖ్యకు గుర్తుగా సునీల్ గవాస్కర్ రూ. 35 లక్షలను ప్రధానమంత్రి సహాయనిధికి ఇచ్చారు. ఇక దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ఆడిన ఆయన 24 సెంచరీలు సాధించారు. ఆ 24 సెంచరీల సంఖ్యకు గుర్తుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి గవాస్కర్ రూ. 24 లక్షలు అందించారు.
భారత్ తరఫున 127 టెస్టులాడిన సునీల్ గవాస్కర్ 51.12 సగటుతో 10,122 పరుగులు చేశారు. ఇందులో 34 సెంచరీలు, ఉన్నాయి. టెస్టుల్లో 4 డబుల్ సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సన్నీ బాదారు. టెస్టు క్రికెట్‌లో 10వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఫస్ట్ క్రికెటర్‌గా ఆయన అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన సన్నీ.. వన్డేల్లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయారు. 108 వన్డేలాడిన గవాస్కర్ 35.14 సగటుతో 3,092 పరుగులు చేశారు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది.