లాండర్‌హిల్ : అమెరికా భద్రతాధికారులు మరోసారి తమ పైత్యం చూపించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులను ఇబ్బంది పెట్టిన అమెరికా సెక్యూరిటీ సిబ్బంది.. తాజాగా దిగ్గజ క్రికెటర్‍గా ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న సునీల్ గవాస్కర్‌ను అడ్డుకున్నారు.
అమెరికాలో తొలిసారి భారత్, వెస్టిండీస్ జట్లు రెండు టీ20 మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే. కాగా, ఆదివారం ఫ్లోరిడా రాష్ట్రంలోని లాడర్‌హిల్స్‌లో ఉన్న సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియంలో ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌కు అఫిషియల్ బ్రాడ్‌కాస్టర్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు గవాస్కర్ అక్కడికి వెళ్ళారు. అయితే, ఆయనను భద్రతాధికారులు గుర్తించలేదు. అభిమానులు గవాస్కర్ గురించి చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. స్టేడియంలోకి వెళ్ళేందుకు ఆయనను అనుమతించలేదు.

'ఎవరైతే మాకేంటి? లోనికి వెళ్లనిచ్చేది లేదు' అంటూ సెక్యూరిటీ అధికారి తన పైత్యాన్ని చాటుకున్నాడు. ఎవరో తెలియకుముందు అనుమతించకుంటే పరువాలేదు కానీ, తెలిసిన తర్వాత కూడా అనుమతించకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, గవాస్కర్ మాత్రం ఈ ఘటనపై రభస చేయకుండా, వారి విధులు వారు నిర్వహించారంటూ.. హుందాగా వ్యవహరించారు.
అంతేగాక, గేటు బయటే అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ గడిపారు. ఇంతలో టీమ్ బస్ రావడంతో ఆయనను అధికారులు లోపలికి అనుమతించారు. కాగా, ఓ అభిమాని ఈ ఘటననంతా పరిశీలించి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇది ఇలా ఉండగా, వర్షం కారణంగా రెండో టీ20 మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఒక మ్యాచ్ గెలిచిన విండీస్ టీ20 టోర్నీ విజేతగా నిలిచింది.