ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న వేళ.. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విదేశీ ప్లేయర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరు విదేశీ స్టార్లు ఐపీఎల్ ఫ్రాంచైజీలను, భారతీయ ఆతిథ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారని గవాస్కర్ మండిపడ్డారు. ప్రతి ఏటా ఐపీఎల్ వేలానికి ముందు అందుబాటులో ఉంటామని చెప్పి.. తీరా టోర్నీ మొదలయ్యే సమయానికి గాయాలు లేదా వ్యక్తిగత కారణాలు చెబుతూ విదేశీ ప్లేయర్లు తప్పుకోవడం లేదా ఆలస్యంగా రావడం పరిపాటిగా మారిందని.. గవాస్కర్ తన తాజా కాలమ్‌లో ఘాటుగా స్పందించారు.
ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాలు ప్లేయర్ల కోసం ఎంతో ఖర్చు చేస్తాయని.. వారి కుటుంబ సభ్యులు వచ్చి వారితో గడపడానికి అయ్యే ఖర్చులను కూడా భరిస్తాయని గవాస్కర్ చెప్పుకొచ్చారు. కానీ కొందరు విదేశీ ప్లేయర్లు ఈ భారతీయ ఆతిథ్యాన్ని తమ హక్కుగా భావిస్తూ.. పరిస్థితులను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రాంచైజీలు వేలంలో ఎంతో వ్యూహాత్మకంగా ప్లేయర్లను ఎంచుకుంటాయని.. అయితే ప్లేయర్లు చివరి నిమిషంలో అందుబాటులో ఉండమని చెప్పడం వల్ల జట్టు ప్లాన్స్ అన్నీ తలకిందులు అవుతాయని లిటిల్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్రాంచైజీలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి..
ఇలాంటి ప్లేయర్ల పట్ల ఫ్రాంచైజీలు కఠినంగా వ్యవహరించాలని సునీల్ గవాస్కర్ సూచించారు. యాజమాన్యాలు కఠినంగా వ్యవహరించి ఇలాంటి వారిని జట్టు నుంచి తొలగించనంత కాలం ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఆలస్యంగా వచ్చే వారిని అసలు ప్రోత్సహించకూడదని ఆయన స్పష్టం చేశారు.
ఆలస్యంగా వస్తున్న ప్రముఖులు
ఈ సీజన్‌లో ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ బౌలర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్ కారణాల దృష్ట్యా తమ ఫ్రాంచైజీలతో ఆలస్యంగా చేరనున్నట్లు సమాచారం. గవాస్కర్ కామెంట్స్ ప్రధానంగా ఇలాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను ఉద్దేశించే చేసినట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మార్చి 28 నుంచి మే 31 వరకు జరిగే ఈ ఐపీఎల్ పండగ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.