గుజరాత్ టైటాన్స్ ఓటమికి అసలు కారణం ఇదేనా?
ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ జట్టు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద వివాదానికి దారితీశాయి. ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ జట్టుకు కనీసం ప్రాక్టీస్ చేయడానికి కూడా సరైన సమయం దొరకలేదు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆ జట్టు విమానం చండీగఢ్‌లో నిలిచిపోవడమే దీనికి ప్రధాన కారణం.
చండీగఢ్ ఎయిర్పోర్టులో నిలిచిపోయిన విమానం
శుక్రవారం చండీగఢ్‌లో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించిన గుజరాత్ జట్టు శనివారం మధ్యాహ్నమే చార్టర్డ్ ఫ్లైట్‌లో అహ్మదాబాద్ చేరుకోవాల్సి ఉంది. కానీ పంజాబ్ సహా ఉత్తర భారతంలో ఒక్కసారిగా చెలరేగిన భారీ తుఫాను, వర్షం కారణంగా చండీగఢ్ విమానాశ్రయం పరిధిలో విమానాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీనివల్ల గుజరాత్ టైటాన్స్ జట్టు శనివారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో చాలా ఆలస్యంగా అహ్మదాబాద్ చేరుకుంది. ఫలితంగా ఫైనల్ లాంటి భారీ మ్యాచ్‌కు ముందు వ్యూహాలు రచించడానికి, మైదానంలో ప్రాక్టీస్ చేయడానికి ఆ జట్టుకు కనీసం 18 గంటల సమయం కూడా లభించలేదు.

బీసీసీఐ షెడ్యూలింగ్‌పై ప్రశ్నలు.. ఆర్సీబీకి కలిసొచ్చిన అదృష్టం
ఐపీఎల్ చరిత్రలోనే ఓ జట్టు ఫైనల్ మ్యాచ్‌కు కేవలం ఒక్క రోజు ముందు అలసటతో కూడిన ప్రయాణం ఇదే మొదటిసారి. ఈ సీజన్లో బీసీసీఐ ప్లేఆఫ్ మ్యాచ్‌లను 3 వేర్వేరు నగరాల్లో నిర్వహించాలని తీసుకున్న వినూత్న నిర్ణయమే ఈ సమస్యకు కారణమైంది. దీనికి భిన్నంగా క్వాలిఫయర్-1 గెలిచి నేరుగా ఫైనల్ చేరిన ఆర్సీబీ జట్టు బుధవారమే ప్రశాంతంగా అహ్మదాబాద్ చేరుకుంది. వరుసగా రెండోసారి ఫైనల్ ఆడుతున్న ఆ జట్టుకు విశ్రాంతి తీసుకోవడానికి, అలసట నుంచి కోలుకోవడానికి, మైదానంలో చెమటోడ్చడానికి పుష్కలంగా సమయం దొరికింది. కానీ గుజరాత్ టైటాన్స్‌కు ఆ అదృష్టం లేకపోయింది.
ఫైనల్‌ను వాయిదా వేయాల్సింది: సునీల్ గవాస్కర్
గుజరాత్ టైటాన్స్ జట్టుకు జరిగిన ఈ అన్యాయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ బీసీసీఐపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సునీల్ గవాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. "ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్‌ను వాయిదా వేయాల్సింది. ఆటగాళ్లకు శారీరక, మానసిక విశ్రాంతి చాలా అవసరం. విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందో తెలియనప్పుడు ఆటగాళ్లలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. బీసీసీఐ వద్ద అదనంగా ఒక 'రిజర్వ్ డే' అందుబాటులో ఉన్నప్పుడు, ఈ అసాధారణ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఫైనల్‌ను ఒక రోజు ముందుకు జరిపి ఉంటే గుజరాత్‌కు కూడా సమానమైన అవకాశం దక్కేది" అని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు.
అంగీకరించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్
మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగన మీడియా సమావేశంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా తమకు అదనపు విశ్రాంతి దొరకడం వల్ల కొంతవరకు ప్రయోజనం చేకూరుతుందని అంగీకరించాడు. రజత్ పటిదార్ మాట్లాడుతూ.. "క్వాలిఫయర్-1 ముగిసిన తర్వాత మాకు తగినంత విశ్రాంతి లభించింది. మరోవైపు గుజరాత్ జట్టు క్వాలిఫయర్-2 ఆడిన వెంటనే ప్రయాణాలు చేస్తూ ఇక్కడికి వచ్చింది. ఖచ్చితంగా మాకు కొంత అడ్వాంటేజ్ ఉంది. అయితే రెండు జట్లు కూడా చాలా బలంగా ఉన్నందున ఇది మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా శాసించకపోవచ్చు" అని రజత్ పాటిదార్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications