
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. పూర్తిగా నిరాశపర్చిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. అగ్రశ్రేణి జట్లయిన పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాల తర్వాత పసికూనలైన అఫ్గనిస్థాన్, స్కాట్లాండ్, మీబియాపై భారత్ భారీ విజయాలు అందుకుంది. అయినా కోహ్లీసేన సెమీస్‌కు చేరుకోలేకపోయింది. మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్ర కూడా ముగిసింది. ఈ క్రమంలో టీ20ల్లో తర్వాతి కెప్టెన్ ఎవరు అనే అంశంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
సోమవారం రాత్రి నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ సందర్భంగా విరాట్ కోహ్లీ, మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ టీ20ల్లో కెప్టెన్ ఎవరు అనే అంశంపై పెద్ద హింటే ఇచ్చారు. రోహిత్ శర్మ తర్వాతి కెప్టెన్ అని వారు చెప్పకనే చెప్పారు. అయితే భారత జట్టు దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లలో ఒకరిని సారధి చేయాలని కూడా కొందరు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి తొందరపాటు నిర్ణయం వద్దని భారత మాజీ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించాడు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ సరైనోడు అని అభిప్రాయపడ్డాడు.
'2023 ప్రపంచకప్ కోసమైతే దీర్ఘకాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకు రెండు సంవత్సరాల సమయం మనకు ఉంది. కానీ తదుపరి ప్రపంచకప్‌కు కేవలం 10-12 నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఏడాది మరో ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో జట్టుకు కప్పు అందించగలిగే వ్యక్తిని ఎంచుకోవాలి. రోహిత్ శర్మ సరైన చాయిస్. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సారధ్య బాధ్యతలు అతనికే అందించాలి. అతడి ఐపీఎల్ గణాంకాలు బాగున్నాయి. రోహిత్ సారథ్యం బాగుంటుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్ తర్వాత మరొక టీ20 కెప్టెన్‌ను పరిశీలించవచ్చు. ఇప్పుడైతే రోహిత్ శర్మకు ఇవ్వాలి' అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
'జట్టులో ఏదో ఒక విధమైన మార్పు ఉండాలని నేను భావిస్తున్నాను. కానీ భారీ స్థాయిలో మాత్రం ఉండకూడదు. కొత్త ముఖాలు, ఆలోచనలు అవసరం. అది జరుగుతుందని నేను భావిస్తున్నా. ప్రపంచకప్‌లో రాణించలేదని భారీ మార్పులు ఉండకూడదు. అలాంటివి పనికిరావు. తదుపరి ప్రపంచకప్‌కు ముందు భారత్ కనీసం 20 టీ20లు ఆడబోతోంది. కాబట్టి కొంతమంది ఆటగాళ్లకు ఇది గొప్ప అవకాశం. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ తప్పనిసరిగా ఆస్ట్రేలియా గురించి ఆలోచించాలి. ఆస్ట్రేలియాలో ఎలాంటి పిచ్‌లు ఉన్నాయి, బౌండరీల పరిమాణం లాంటి విషయాలను గుర్తుంచుకుని ఆటగాళ్లను ఎంచుకోవాలి' అని సన్నీ పేర్కొన్నాడు.