WTC Final 2021: టీమిండియా తుది జట్టులో మార్పులు.. విహారికి ఛాన్స్! అంతా వరణుడి దయ!!

సౌథాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడే భారత తుది జట్టును బీసీసీఐ గురువారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదుగురు స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌తో పాటు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లను జట్టులోకి తీసుకుంది. అయితే శుక్రవారం మ్యాచ్ ప్రారంభానికి ముందు సౌథాంప్టన్‌లో వర్షం కురవడంతో తొలిరోజు ఆటలోని మొదటి, రెండో సెషన్‌లు టాస్ కూడా పడకుండానే రద్దయ్యాయి. వర్షం ఆగి టాస్ వేసే సమయానికి భారత్ గురువారం ప్రకటించిన జట్టులో మార్పులు చేయొచ్చని టీమిండియా మాజీ ప్లేయర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అంటున్నారు.

విహారికి చోటు దక్కనుందా?:
వర్షం కారణంగా భారత్ తుది జట్టులో ఒక స్పిన్నర్‌ను తొలగించి.. అదనపు బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేసే వీలుందని సునీల్ గవాస్కర్ అంచనా వేశారు. సన్నీ చెప్పింది నిజమయితే.. హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారి అదనపు బ్యాట్స్‌మన్‌గా ఎంపికకానున్నాడు. గురువారం ప్రకటించిన జట్టులో విహారికి చోటు దక్కలేదు. ఆరో స్థానంలో రిషబ్ పంత్‌కు చోటు దక్కగా.. ఇద్దరు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు అవకాశం దక్కింది. సన్నీ చెప్పినట్టు అదనపు బ్యాట్స్‌మన్‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకోవాలని భావిస్తే.. విహరికే అవకాశం రానుంది. అయితే జడేజాను తప్పించే సాహసం కోహ్లీ చేయకపోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

టాస్ వరకు ఏదీ ఫైనల్ కాదు:
తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'ఫైనల్ కోసం గురువారమే భారత్ తుది జట్టును ప్రకటించింది. కానీ ఇరు జట్ల కెప్టెన్లు టాస్ సమయంలో తమ ఆటగాళ్ల జాబితా పత్రాన్ని మార్చుకునే వరకు ఏదీ ఫైనల్ కాదు. దీన్నిబట్టి అప్పటివరకు జట్టులో మార్పులు చేసుకోవచ్చు. నేను ఆడే రోజుల్లో కెప్టెన్‌గా ఉన్నప్పుడు స్పిన్నర్‌ను తీసుకోవాలా లేదా అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలా అనే సందేహం తలెత్తినప్పుడు.. ప్రత్యర్థి జట్టును చూసి జట్టులో మార్పులు చేసేవాడిని. అలా టాస్ వేసేవరకు ఎవరినైనా మార్చవచ్చు' అని అన్నారు.

స్పిన్నర్‌ను తప్పించొచ్చు:
'ఇప్పుడు సౌథాంప్టన్‌లో ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఒక అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలని భారత్ ఆలోచించొచ్చని నేను భావిస్తున్నా. ఎందుకంటే.. ఈ వాతావరణం న్యూజిలాండ్ బౌలర్లకు బాగా అనుకూలం. కివీస్ జట్టులో స్వింగ్ చేసే బౌలర్లు ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. రిషబ్ పంత్ ఇప్పుడు ఆరో స్థానంలో ఆడనున్నాడు. ఇంకో బ్యాట్స్‌మన్‌ను తీసుకుంటే.. అతడు ఏడో స్థానంలో బరిలోకి దిగుతాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక స్పిన్నర్‌ను తప్పించొచ్చు' అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఆరో స్థానంలో హనుమ విహారి గతంలో బాగా ఆడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విదేశాల్లో అతడి రికార్డు బాగుంది.

భారత జట్టు:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications