IND vs ENG: లార్డ్స్‌లో సెంచరీ చేసినంతమాత్రాన అంతా సాధించినట్లు కాదు: సన్నీ

ముంబై: క్రికెట్ పుట్టినిల్లు అయిన లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసినంతమాత్రాన అంతా సాధించినట్లు కాదని భారత దిగ్గజ బ్యాట్స్‌మన్, స్టార్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత బ్యాట్స్‌మెన్ విదేశాల్లో ఎక్కడ సెంచరీ బాదినా.. అది ప్రత్యేకమే అన్నాడు. ఓ బ్యాట్స్‌మన్ సెంచరీ చేశాడంటే అతడిలో మంచి నైపుణ్యం ఉన్నట్టే అని సన్నీ పేర్కొన్నాడు. రెండో టెస్టులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులు చేయడంపై స్పందిస్తూ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో గెలిచి.. ఐదు టెస్టుల సిరీసులో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

రోహిత్ తన ఆటను అద్భుతంగా మలుచుకున్నాడు:
ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన భారత మాజీ సారథి సునీల్ గవాస్కర్.. రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను ప్రశంసించాడు. రెండో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ అద్భుతమైన మానసిక స్థైర్యంతో బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. 'ఒక టెస్టు మ్యాచ్‌లో పిచ్ ఎలా స్పందిస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. పిచ్‌లో జీవం ఉందా లేదా అనేది తెలియదు. బంతి బౌన్స్ అవుతుందా లేదా అనేది అర్థం కాదు. ఇవన్నీ తెలియాలంటే కాస్త సమయం పడుతుంది. ఈ క్రమంలోనే రోహిత్ తన ఆటను అద్భుతంగా మలుచుకున్నాడు. ఎలాంటి షాట్లు ఆడాలి. ఎలాంటి బంతులు వేయాలనే విషయాలపై కచ్చితమైన అవగాహనతో ఉన్నాడు' అని సన్నీ అన్నాడు.

అదొక్కటే ముఖ్యం కాదు:
'ఏది చేయాలన్నా మానసికంగా దృఢంగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ విషయంలో ఓపెనర్ రోహిత్ శర్మ మంచి పనిచేశాడు. ఒక బ్యాట్స్‌మన్ ఒక మ్యాచ్‌లో 80 పరుగులు చేశాడంటే.. సిరీస్ మొత్తం 400 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఉంటుంది. ఒక ఆటగాడి నుంచి కెప్టెన్ ఇంతకన్నా ఏం ఆశించగలడు?. ఇక సెంచరీ కోల్పోవడంతో రోహిత్ బాధపడి ఉండొచ్చు. కానీ లార్డ్స్‌లో శతకం సాధించినంత మాత్రాన అంతా జయించినట్టు కాదు, అదొక్కటే ముఖ్యం కాదు. భారత బ్యాట్స్‌మెన్ విదేశాల్లో ఎక్కడ సెంచరీ బాదినా.. అది ప్రత్యేకమే. ఓ బ్యాట్స్‌మన్ సెంచరీ చేశాడంటే అతడిలో మంచి నైపుణ్యం ఉన్నట్టే' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.

సచిన్ కూడా:
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. 'రోహిత్ జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాడు. అతడి ఆట తీరును చూస్తే అలాగే అనిపించింది. ఎందుకంటే రోహిత్ పరిస్థితులకు తగినట్టు తన ఆటను మార్చుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో తనలో మరో కోణాన్ని చూపించాడు' అని అన్నాడు. 'భారత బ్యాటింగ్ లైనప్‌కు రోహిత్ నాయకుడిగా ఉన్నాడు. కేఎల్ రాహుల్ అతడికి బాగా మద్దతిచ్చాడు. నిజానికి రోహిత్ పుల్ షాట్లను అద్భుతంగా ఆడగలడు. ఆ షాట్లతో బంతిని అలవోకగా స్టేడియం దాటించగలడు. అతడెలా ఔటయ్యాడన్నది కాకుండా.. ఈ రెండు టెస్టుల్లో అతడు జట్టుకేం చేశాడన్నదే నేను చూస్తున్నాను. జట్టుకు విలువైన పరుగులు అందించేందుకు రోహిత్ తన సహకారం అందిస్తున్నాడు' అని మాస్టర్ బ్లాస్టర్ పేర్కొన్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్‌లో ఈనెల 25 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications