
భారత క్రికెట్ చరిత్రలో మధుర ఘట్టం:
'భారత్ మాయాజాలం చేసింది. భారత క్రికెట్ చరిత్రలో మధుర ఘట్టం ఇది. ఆటగాళ్లు కేవలం మ్యాచ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నించలేదు. గెలుపుతోనే పర్యటనకు ముగించాలన్న పట్టుదల కనబరిచారు. యువ భారత్ సాధించింది. ఎవరికీ భయపడమని చాటి చెప్పింది. ఏమి గెలుపు.. ఎంత అద్భుతమైన విజయం. నేను ఇంకా మేఘాల్లో విహరిస్తున్నా. చంద్రునిపై ఉండే కక్ష్యలో ఉన్నాను' అని సునీల్ గవాస్కర్ అన్నారు. 3 వికెట్ల తేడాతో చివరి టెస్ట్‌లో గెలిచి 2-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. 32 ఏళ్లుగా ఓటమెరుగని బ్రిస్బేన్‌లో కంగారూల పని పట్టి గబ్బా కోటను బద్ధలు కొట్టింది.

రహానే సూపర్:
'చివరి రోజు ఉదయం శుభ్‌మన్ గిల్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. మధ్య సెషన్లో కంగారూలు పైచేయి సాధించకుండా పోరాట యోధుడు చతేశ్వర్ పుజారా చూసుకున్నాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ జోరు చూపించాడు. అజేయ సారథి అజింక్య రహానే మరోసారి పంత్‌ను ఐదో స్థానంలో పంపాడు. ఆసీస్‌లో అతడు సారథ్యం వహించిన మూడు టెస్టుల్లో రెండింట్లో భారత్ నెగ్గింది. ఇంతకుముందు రహానే నాయకత్వంలో రెండు టెస్టుల్లోనూ జట్టు గెలిచింది' అని భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.

ఈ ఘనత ఎవరిదని చెప్పాలి:
'2018-19 సిరీస్ విజయం కంటే ఈ గెలుపు మరింత అద్భుతమైనది. పూర్తిస్థాయి జట్టుతో ఆసీస్ బరిలో దిగింది. యువ భారత్ విజయం చాలా ప్రత్యేకమైనది. ఈ ఘనత ఎవరిదని చెప్పాలి? మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం సుందర్, శార్దూల్ ఠాకూర్ల బ్యాటింగ్ విధానం. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్‌ల ఆట. వీళ్లంతా యువ ఆటగాళ్లు. భారత క్రికెట్ భవిష్యత్తు గొప్పగా ఉంటుందనడంలో సందేహం లేదు' అని సన్నీ చెప్పుకొచ్చారు.

ఎంత చెప్పినా చాలా తక్కువే:
'పుజారా గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుంది. అతను తన శరీరాన్ని భారత క్రికెట్ కోసం, భారత క్రికెట్ జట్టు కోసం పణంగా పెట్టాడు. పుజారా గ్లోవ్స్, బాడీ, హెల్మెట్‌కు పదేపదే బంతులు తగిలినా ఏమాత్రం బెదరలేదు. క్రీజులో ఉంటూ యువ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చాడు. అందుకే అతని ఇన్నింగ్స్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రెండవ సెషన్లో భారత్ రెండు వికెట్లు కోల్పోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది' అని సునీల్ గవాస్కర్ అన్నారు.
ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టిన టీమిండియా.. నెం.1లో న్యూజిలాండ్!