
ఈ నెలాఖరులో ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరీస్‌కు 17మంది ప్లేయర్లతో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో ఐపీఎల్లో రాణించిన పలువురు యువకులు ఎంపికయ్యారు. ఇక ఈ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇకపోతే అక్టోబరు-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఆటగాళ్లను ఫిల్టర్ చేసేందుకు ఈ సిరీస్‌ను బీసీసీఐ ఉపయోగించుకోనుంది. ఇక ఈ జట్టులో ఐపీఎల్లో రాణించిన స్టార్ ప్లేయర్ రాహుల్ తెవాతీయా పేరు మిస్సయింది.
ఐపీఎల్ 2022లో ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ తరఫున రెండు మ్యాచ్‌లను తన అద్భుత ఫినిషింగ్‌తో తెవాతీయా గెలిపించాడు. ఐపీఎల్లో ఒకానొక గొప్ప ఫినిషర్‌గా తెవాతీయాకు పేరు పడింది. ఇక తెవాతీయాను ఐర్లాండ్ టూర్‌కు ఎంపిక చేయాల్సిందని టీమిండియా మాజీ దిగ్గజం, విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అతను ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టులో భాగంగా ఉండాలని పేర్కొన్నాడు.
'రాహుల్ తెవాటియా బ్యాటింగ్ చూసినప్పుడు కొన్నిసార్లు ఎవరికైనా అనిపిస్తుంది ఎంత మంచి ఫినిషర్ ఇతను అని.. ఒకవేళ జట్టులో కుదరకపోతే అదనపు సభ్యుడిగానైనా అతన్ని సెలెక్ట్ చేయాల్సింది. ఎందుకంటే అంత స్థిరంగా రాణించిన వారిని వదిలివేయడం కష్టం. అతను ఓడిపోయే మ్యాచ్‌లను గెలిపించాడు. అతను అత్యంత ఒత్తిడిలో చాలా తెలివిగా, చాలా బలంగా హిట్టింగ్ ఆడగలడు. అతను ఆన్‌సైడ్‌లోనే కాకుండా ఆఫ్‌సైడ్ కూడా ఆడగలడు' అని సునీల్ గవాస్కర్ చెప్పాడు. 'బహుశా అతన్ని అదనపు ప్లేయర్‌గా జోడించి ఐర్లాండ్‌కు తీసుకెళ్లవచ్చు.

ఎందుకంటే అతన్ని తాము గుర్తించామనే భావనను సెలెక్టర్లు తీసుకురావడం కోసం ఆ పనైనా చేయాల్సింది. తద్వారా మీరు ఇంకాస్త కష్టపడితే జట్టులో భాగమవుతారనే అనే హోప్ తెవాతీయాకు కూడా కలిగేది' గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఇక జూన్ 26, 28 తేదీల్లో డబ్లిన్‌లో టీమిండియా రెండు టీ20లు ఆడనుంది. ఐర్లాండ్‌తో ఆడబోయే టీమిండియా టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవిబిష్ణోయ్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్