ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోస్ హేజిల్‌వుడ్‌పై ఉద్దేశపూర్వకంగా వేటు వేశారని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆరోపించాడు. గాయం కారణం చెప్పి అతన్ని తప్పించారని అన్నాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ మొత్తానికి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. విలేకరుల సమావేశంలో హేజిల్‌వుడ్ బాగానే ఉన్నాడని, కానీ అతను చేసిన వ్యాఖ్యలతోనే వేటు వేసి ఉంటారని అభిప్రాయపడ్డాడు.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆట అనంతరం హేజిల్‌వుడ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆస్ట్రేలియా జట్టులో విభేదాలు ఉన్నాయని కథనాలు వచ్చాయి. ఛేదనలో నాలుగో రోజు ఆస్ట్రేలియా ఎలా ఆడనుందని హేజిల్‌వుడ్‌ను ప్రశ్నించగా.. ''ఈ ప్రశ్నను ఒక్క బ్యాటర్‌ను అడగాలి'' అని అతను సమాధానమిచ్చాడు. దీనిపై పెద్దఎత్తున చర్చలు సాగాయి.

అయితే ఈ వ్యాఖ్యల వల్లే హేజిల్‌వుడ్‌ను తప్పించారని గవాస్కర్ తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టులో కలవరం స్పష్టంగా కనిపిస్తోందని అన్నాడు. ఆసీస్ జట్టులో కొందరిపై వేటు వేయాలని మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారని, హేజిల్‌వుడ్ వ్యాఖ్యలతో జట్టులో విభేదాలు ఉన్నాయని పేర్కొంటున్నారని చెప్పాడు.అయితే హేజిల్‌వుడ్ రెండో టెస్టుకు దూరమవ్వడం మిస్టరీగా ఉందని గవాస్కర్ అన్నాడు. విలేకర్ల సమావేశంలో అతడు బాగానే ఉన్నాడని, కానీ వ్యాఖ్యలు చేసిన తర్వాత పక్కటెముకల గాయమని జట్టుకు దూరమయ్యాడని పేర్కొన్నాడు.

ఒకప్పుడు ఇలాంటి పరిణామాలు భారత క్రికెట్లో జరిగేవని, ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయని గవాస్కర్ అన్నాడు. పెర్త్ టెస్టులో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా 295 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో హేజిల్‌వుడ్ నాలుగు వికెట్లతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ పడగొట్టాడు. కాగా, హేజిల్‌వుడ్ స్థానంలో అన్‌క్యాపడ్ పేసర్లు సీన్ అబాట్, బ్రెండన్ డెగాట్ ఎంపికయ్యారు. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి పింక్ బాల్‌తో రెండో టెస్టు జరగనుంది. ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది.