IND vs ENG: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. చివరి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేస్తే ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన దిగ్గజ సునీల్ గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టే చారిత్రక అవకాశం గిల్‌కు లభించింది. అయితే దురదృష్టవశాత్తు, గిల్ కేవలం 11 పరుగులకే పెవిలియన్ చేరి గవాస్కర్ రికార్డుకు 21 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఈ విషయంలో నిరాశ ఉన్నప్పటికీ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్వయంగా శుభ్‌మన్ గిల్‌ను కలిసి ఒక ప్రత్యేక బహుమతిని అందించడమే కాకుండా.. భవిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యంపై మరో కీలక బాధ్యతను కూడా అప్పగించారు.
గవాస్కర్ బహుమతి.. తదుపరి లక్ష్యం
సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన ఒక వీడియోలో.. సునీల్ గవాస్కర్ శుభ్‌మన్ గిల్‌ను కలుసుకున్న దృశ్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గవాస్కర్ గిల్‌ను అభినందిస్తూ.. "శభాష్! నన్ను దాటిపోయే ఆశతో నీకోసం ఒక బహుమతి తెచ్చాను. అయితే కనీసం తర్వాతి సిరీస్‌లో నీకో లక్ష్యం ఉంటుంది కదా. ఇది ఒక చిన్న బహుమతి, నా పేరులోని మొదటి అక్షరాలు 'ఎస్‌జీ' ఉన్న షర్ట్. నా కోసం ఎవరో తయారు చేశారు, కానీ నేను నీకు ఇస్తున్నాను. నీకు సరిపోతుందో లేదో తెలియదు. ఇది ఒక చిన్న టోపీ, ఇది నేను చాలా తక్కువ మందికి మాత్రమే ఇస్తాను, నా సంతకంతో సహా" అని అన్నారు. ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధికంగా 774 పరుగులు చేసిన రికార్డు గవాస్కర్ పేరు మీద ఉండగా, ఈ సిరీస్‌లో గిల్ 754 పరుగులతో దానికి చేరువయ్యాడు. గావస్కర్ బహుమతి మాటలు గిల్‌కు మరింత ప్రోత్సాహాన్ని అందించాయని చెప్పొచ్చు.

టీమిండియా విజయానికి గవాస్కర్ సెంటిమెంట్
ఓవల్‌లో జరుగుతున్న ఈ ఐదో టెస్ట్ మ్యాచ్ ఈ రోజే ముగియవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా విజయం కోసం సునీల్ గవాస్కర్ ఒక ప్రత్యేక సెంటిమెంట్‌ను అనుసరించాలని నిర్ణయించుకున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ .. "చివరి కదలిక అద్భుతంగా ఉంది. ఒక ఫీల్డర్‌ను అక్కడికి (డీప్‌గా) పంపడం, యార్కర్ వేయడం" అని భారత బౌలర్ల వ్యూహాత్మక అమలును, ముఖ్యంగా కీలక సమయంలో వికెట్లు తీయడంలో వారి నైపుణ్యాన్ని అభినందించారు. ఇది భారత బౌలింగ్ విభాగం ఎంత పదునుగా ఉందో సూచిస్తుంది.
ఆ తర్వాత గవాస్కర్ తన సెంటిమెంట్‌ను పంచుకుంటూ, "నేను రేపు నా లక్కీ జాకెట్ ధరించబోతున్నాను. నేను దానిని ఆస్ట్రేలియాలో, గతంలో గాబాలో ధరించాను, అది కేవలం విజయాల కోసమే నాకు దొరికింది. నేను ఆ తెల్లటి జాకెట్‌ను ధరించబోతున్నాను. శుభాకాంక్షలు, దేవుడు నిన్ను దీవించుగాక" అని అన్నారు. గాబాలో భారత్ చారిత్రక విజయాన్ని సాధించినప్పుడు గవాస్కర్ ఈ జాకెట్‌ను ధరించినట్లు పేర్కొనడం, ఈ జాకెట్ భారత విజయాలకు ఎంత అదృష్టమో తెలియజేస్తుంది. తన లక్కీ జాకెట్‌ను ధరించి టీమ్ ఇండియా గెలుపుకు తన మద్దతును అందిస్తానని గవాస్కర్ చెప్పడం, ఆట పట్ల, జట్టు పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను, విశ్వాసాన్ని చాటిచెబుతుంది.