రాంచీలో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ బాదాడు. ఇది విరాట్ కోహ్లీకి వన్డే కెరీర్లో 52వ సెంచరీ. ఈ శతకంతో ఓ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. టెండూల్కర్ టెస్టుల్లో 51 సెంచరీలు చేశారు. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీని ప్రశంసిస్తూ.. అతడు వన్డే ఫార్మాట్లో గొప్ప ఆటగాడని కొనియాడారు.
సునీల్ గవాస్కర్ ఏం చెప్పారంటే?
జియోహాట్‌స్టార్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లీతో కలిసి ఆడిన, అతడికి వ్యతిరేకంగా ఆడిన వారందరూ కోహ్లీ వన్డేల చరిత్రలోనే గొప్ప ఆటగాడు అని అంగీకరిస్తారు. రికీ పాంటింగ్ కూడా అతడిని అత్యంత గొప్పవాడు (GOAT) అని పిలిచారు. ఆస్ట్రేలియా వారి నుంచి ప్రశంసలు పొందడం చాలా కష్టం. మీరు సచిన్‌ను అధిగమించినప్పుడు ఈ మనిషి ఎక్కడ నిలబడ్డాడో మీకు తెలుస్తుంది." అని గవాస్కర్ పేర్కొన్నారు.

విమర్శకుల నోటికి తాళం వేసిన కోహ్లీ
ఆస్ట్రేలియాపై జరిగిన 3 వన్డేల సిరీస్‌లో మొదటి 2 మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌లలోనూ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. కోహ్లీ కెరీర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. వరుసగా రెండు వైఫల్యాల తర్వాత విరాట్ కెరీర్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతమంది క్రికెట్ నిపుణులు అతడిని వన్డే ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పాలని సలహా ఇవ్వడం ప్రారంభించారు. ఆస్ట్రేలియాపై మూడో వన్డేలో విరాటో కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి విమర్శకుల నోళ్లను మూయించాడు.
రాంచీలో 135 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్
రాంచీ వన్డేలో విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 7 సిక్సర్లు, 11 ఫోర్లతో 135 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ తదుపరి వన్డే ప్రపంచ కప్ ఆడిన తర్వాతే అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు చెబుతాడనేది దాదాపు స్పష్టమైంది. విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.