నిర్ణయాత్మక మూడో వన్డేలో 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను భారత్ చిత్తు చేసింది. 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో సంజు శాంసన్ (108; 114 బంతుల్లో) ఆట హైలైట్‌గా నిలిచింది. తక్కువ అవకాశాలు, ఎక్కువ అంచనాలతో బరిలోకి దిగుతున్న సంజు శాంసన్ ఈ సారి అదరగొట్టాడు.
అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. అర్షదీప్ సింగ్ (4/30), వాషింగ్టన్ సుందర్ (2/38), అవేశ్ ఖాన్ (2/45) సత్తాచాటారు. సఫారీ జట్టు ఓపెనర్ టోనీ డిజోర్జి (81; 87 బంతుల్లో) పోరాడాడు.తన కెరీర్‌లో సంజు శాంసన్ తొలి సెంచరీ సాధించాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నెటింట్లో పాటు మాజీ క్రికెటర్లు నుంచి శాంసన్ పొగడ్తలు అందుకుంటున్నాడు.

ఇకపై సంజు శాంసన్ జీవితం మారిపోతుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ''ఈ సెంచరీ సంజు కెరీర్‌ను మార్చేస్తుంది. అతడికి ఎంతో ప్రతిభ ఉంది. కానీ ఇప్పటివరకు తన సత్తా ఏంటో నిరూపించే అవకాశం రాలేదు. మొత్తంగా ఈ రోజు అతడు శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు షాట్ల ఎంపిక చాలా బాగుంది. ఓపికగా మంచి బంతుల్ని గౌరవిస్తూ చెడ్డ బంతుల కోసం ఎదురు చూశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడి మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నా'' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ సంజు శాంసన్ కొనియాడాడు. ''గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో సంజు శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. దురదృష్టవశాత్తు అతడికి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు అవకాశాలు ఇవ్వలేకపోయాం. ఎందుకంటే వన్డేల్లో ఆ కీలక స్థానాలు ఆక్రమించే దిగ్గజాలు ఉన్నారు. అయితే వచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉంది'' అని రాహుల్ అన్నాడు.
మరోవైపు వ్యాఖ్యత హర్ష భోగ్లే కొనియాడుతూ.. విరాట్ కోహ్లి తర్వాత మూడో స్థానాన్ని సంజు శాంసన్‌కు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. సంజు గొప్పగా ఆడాడని తెలిపాడు. కాగా, సంజు శాంసన్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో కనీసం 500కు పైగా పరుగులు చేసిన భారత క్రికెటర్లలో 50కు పైగా సగటుతో పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ మాత్రమే ఉన్నారు.