
రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ సామర్థ్యంపై ఎలాంటి సందేహం లేదని, అయితే భారత టీ20 జట్టులో అతను కన్సిస్టెన్సీ ప్లేయర్‌గా ఉండటానికి అతను తన షాట్ ఎంపికను మెరుగుపరచుకోవాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. గేమ్ ఛేంజర్‌గా ఉండే అతని సామర్థ్యాన్ని ఎవరూ ప్రశ్నించలేరని గవాస్కర్ శాంసన్‌కు మద్దతు ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ టీమిండియాకు ఎంపిక కాలేదు. అయితే జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో జరగనున్న 2 మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ కేరళ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ 17మంది సభ్యుల జట్టులో చోటు సంపాదించాడు.
గత రెండు సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరఫున శాంసన్ ఐపీఎల్లో నిలకడగా రాణించాడు. కెప్టెన్‌గా రాజస్థాన్‌ను ఐపిఎల్ 2022లో ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఈ సీజన్లో 150 స్ట్రైక్ రేట్‌తో 458పరుగులు చేశాడు. అయితే రిషబ్ పంత్, దినేష్ కార్తీక్‌లను తొలి ఛాయిస్‌లుగా టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించడంతో శాంసన్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ఎంపిక కాలేదు. 2015లో ఇండియా తరఫున అరంగేట్రం చేసిన సంజూ శాంసన్ మొత్తం 14 టీ20 మ్యాచ్‌లలో 14.50సగటుతో 174పరుగులు చేశాడు.
అంతర్జాతీయ మ్యాచ్‌లలో తన ఐపీఎల్ తరహా గేమ్ ఆడడంతో సంజూ కాస్త విఫలమయ్యాడు. ఇకపోతే ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచ కప్ ఉండడంతో సంజు.. వికెట్ కీపర్ల రేసులో పోటీ తీవ్రంగా ఎదుర్కొనున్నాడు. దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లను తట్టుకుని తుది జట్టులోకి ఎంపిక కావడం చాలా కష్టమే.

కాబట్టి అతని షాట్ సెలెక్షన్ మెరుగ్గా కావాల్సిన అవసరముంది. అప్పుడే అతను ఇండియా తరఫున స్థిరంగా ఆడే ప్లేయర్ అవుతాడు. అప్పుడు జట్టులో అతని స్థానం గురించి ఎవరూ ప్రశ్నలు అడగబోరు' అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇకపోతే ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంకతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో సంజూ శాంసన్ టీ20లో ఇండియా తరఫున చివరిగా ఆడాడు. అతను ఒక మ్యాచ్‌లో 39, ఇంకో మ్యాచ్‌లో 18 పరుగులతో రాణించాడు.