
అహ్మదాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. ఏబీ బ్యాటింగ్ విధ్వంసాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలలేదన్నాడు. అమోఘమైన ఇన్నింగ్స్ ఆడాడని, ఓపెనర్‌గా పంపిస్తే ఇంకా బాగుంటుందని బెంగళూరుకు సన్నీ సూచించాడు. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు కేవలం 1 పరుగు తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ఏబి 42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 23 పరుగులు పిక్కుడుకున్నాడు.
సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'ఏబీ డివిలియర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి తను కొట్టిన ఓ సిక్సర్ హైలెట్. ఆ థర్డ్‌మాన్ మీదుగా కొట్టిన షాట్ ఫేవరెట్. ఏబీడీ ఒక జీనియస్. తను బ్యాటింగ్ చేస్తుంటే.. అలా చూస్తూ ఉండిపోతా. అతడిని ఓపెనర్‌గా ఎందుకు పంపించకూడదు. అలా అయితే తన విశ్వరూపం మరింతగా చూసే అవకాశం లభిస్తుంది. ఏబీడీ 20 ఓవర్ల ఆట చూడాలని ఎవరికైనా ఉంటుంది కదా. ఒక బ్యాట్స్‌మెన్‌గా ఏబీడీ ఇలాంటి భీకరమైన ఫాంలో ఉన్నపుడు నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది' అని అన్నాడు.
ఐపీఎల్‌లో ఏబీ డివిలియర్స్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో తక్కువ (3288) బంతుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా డివిలియర్స్ చరిత్ర సృష్టించాడు. 3554 బంతుల్లో ఈ మైలురాయి అందుకొన్న వార్నర్.. రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. లీగ్‌లో 5 వేల పరుగుల మార్క్ అందుకున్న రెండో విదేశీ క్రికెటర్‌గానూ డివిలియర్స్ నిలిచాడు. ఐపీఎల్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసిన తొలి విదేశీ బ్యాట్స్‌మన్‌గా వార్నర్ (5390) ఈ రికార్డు నెలకొల్పాడు. ఇక లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (6041) టాప్‌లో కొనసాగుతున్నాడు.
నిజానికి బెంగళూరు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ ఏబీ ఇన్నింగ్స్ కారణంగా కోహ్లీసేన మెరుగైన స్కోరు చేయగలిగింది. బెంగళూరు 19 ఓవర్లు ముగిసే సరికి 148/5తో ఉంది. ఈ సమయంలో మార్కస్ స్టోయినిస్‌తో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ చేయించాడు. స్టోయినిస్ లయ అందుకునేలోపే ఏబీ పనికానిచ్చేశాడు. ఆ ఓవర్‌లోని మొదటి బంతిని స్టోయినిస్ వైడ్‌గా వేశాడు. ఆపై 2, 6, 0, 6, 6, 2తో ఏబీ విధ్వంసం సృష్టించాడు. మొత్తంగా ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. దీంతో బెంగళూరు 171/5తో ఇన్నింగ్స్‌ను ముగించింది.