
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్‌కు వెళతాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అంచనా వేశారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీసేన విజయం సాధిస్తుందని అన్నారు. క్రికెట్‌కు సుందర్ పిచాయ్ పెద్ద అభిమాని అన్న సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఓ కార్యక్రమంలో గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు అందుకున్న సుందర్ పిచాయ్ క్రికెట్ గురించి మాట్లాడుతూ "ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతుంది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా సమర్దవంతమైనవి'' అని అన్నారు. USIBC ప్రెసిడెంట్ నిషా దేశాయ్ బిస్వాల్ అడిగిన ప్రశ్నకు పిచాయ్ పైవిధంగా స్పందించాడు.
దీంతోపాటు క్రికెట్, బేస్ బాల్ ఆటలను పోల్చుతూ సుందర్ పిచాయ్ తన అనుభవాలను పంచుకున్నారు. పిచాయ్ మాట్లాడుతూ "నేను తొలిసారి అమెరికాకు వచ్చినప్పుడు బేస్‌బాల్ ఆట పట్ల ఆకర్షితుడినయ్యాను. బేస్ బాల్ సవాల్‌తో కూడుకున్న ఆట. అయితే, నా గేమ్‌లో నేను బంతిని సమర్థవంతంగా వెనకవైపునకు కొట్టాను" అని అన్నారు.
"క్రికెట్‌లో అది మంచి షాట్ అవుతుంది. క్రికెట్‌లో పరుగులు తీస్తున్న సమయంలో ఎల్లప్పుడూ బ్యాట్‌ను పట్టుకునే పరుగులు తీయాలి. బేస్ మధ్యలో నేను బ్యాట్ పట్టుకుని పరుగులు తీశాను. అయితే, నాకు అప్పుడు తెలిసింది.. బేస్‌బాల్ ఆట చాలా భిన్నమైందని. కొన్ని విషయాలపై సర్దుకుపోగలను. క్రికెట్ పట్ల నా అభిప్రాయం మాత్రం మారదు" అని చెప్పారు.