
హైదరాబాద్: మౌంట్ మాంగనీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక ఆల్‌రౌండర్ తిసారా పెరీరా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది.
అనంతరం 320 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక 128 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో శ్రీలంక ఓటమి ఖాయమని అంతా భావించారు. అయితే, ఏడో స్థానంలో బరిలో దిగిన పెరీరా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 57 బంతుల్లో 8 ఫోర్లు, 13 సిక్స్‌ల సాయంతో సెంచరీ సాధించాడు.
పెరీరాకు వన్డేల్లో ఇది తొలి సెంచరీ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాప్ ఆర్డర్ విఫలం కాగా.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మలింగ(17)తో కలిసి ఎనిమిదవ వికెట్‌కు 75 పరుగులు జోడించిన పెరీరా.. సందకన్(6)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు.
చివరి వికెట్‌కు ప్రదీప్(3 నాటౌట్)తో కలిసి 44 పరుగులు జోడించాడు. చివరకు 74 బంతుల్లో 140 పరుగులు చేసిన పెరీరా లంకను గెలిపించేంత పని చేశాడు. లంక విజయానికి 22 బంతుల్లో 23 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో ట్రెంట్ బౌల్ట్ అద్భుతమైన క్యాచ్‌తో చివరి వికెట్‌గా పెరీరా పెవిలియన్‌కు చేరాడు.
దీంతో శ్రీలంక 298 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరిస్‌లో వరుసగా రెండు వన్డేలు గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. తిసారా వీరోచిత పోరాటం కారణంగా శ్రీలంక 298 పరుగులు చేయగలిగింది.
ఈ మ్యాచ్‌లో సౌథీ విసిరిన 46వ ఓవర్లో తిషారా పెరీరా నాలుగు సిక్స్‌లు బాదాడు. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో పెరీరా వేసిన ఓవర్లో నీషామ్ ఐదు సిక్స్‌లు బాదాడు. కాగా, ఈ రెండో వన్డేలో నలుగురు కివీస్ బ్యాట్స్‌మెన్ రనౌటయ్యారు.