హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మైదానం వెలుపల అనవసర వివాదాలతో తన కెరీర్‌ని పాడు చేసుకుంటున్నాడని ఆ దేశ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. బిస్ట్రల్‌లో సోమవారం ఒక పబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు స్టోక్స్‌ను అరెస్ట్ చేసి రాత్రంతా జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే.
కాగా, విచారణ అనంతరం ఎలాంటి చార్జ్ లేకుండానే స్టోక్స్‌ను విడుదల చేశారు. అయితే ఈ అరెస్ట్ కారణంగా జట్టు ట్రైనింగ్ క్యాంప్‌కి బెన్‌స్టోక్స్‌తో పాటు అలెక్స్ హేల్స్ గైర్హాజరయ్యారు. దీంతో ఈ ఘటనను నిర్ధారించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ బుధవారం జరిగిన నాలుగో వన్డే నుంచి వీరిద్దరిని తొలగించారు.

తాజాగా గురువారం ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సన్ న్యూస్‌పేపర్ బయటపెట్టింది. ఇందులో ఇద్దరు వ్యక్తులపై బెన్ స్టోక్స్ పిడిగుద్దులు కురిపిస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. స్టోక్స్ దాడి చేసిన వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సోమర్సెట్ పోలీసులు వెల్లడించారు.
'బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి పంపించాం. ఈ ఘటనకు కారకుడిగా భావిస్తూ ఒక 26 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశాం. ప్రస్తుతం బెన్ స్టోక్స్‌ని విడుదల చేసినా విచారణ మున్ముందు కొనసాగుతుంది' అని పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ ఘటనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందించారు.
'బెన్‌స్టోక్స్‌తో నేను వ్యక్తిగతంగా ఇటీవల ఒకసారి మాట్లాడాను. ఆ సమయంలో అతని జీవనశైలి గురించి చర్చించి మార్చుకోవాల్సిందిగా హెచ్చరించాను. తన క్రికెట్ కెరీర్‌ని అతనే పాడు చేసుకుంటున్నాడని అభిమానులు చెప్పినట్లు కూడా ఆ సందర్భంగా స్టోక్స్‌తో నేను పంచుకున్నాను' అని తెలిపాడు.
'ఇప్పటికీ ప్రపంచంలోనే మూడు క్రికెట్ ఫార్మాట్లలో అతనే ప్రతిభావంతమైన ఆల్‌రౌండర్. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్‌లో భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఆ తర్వాత మైదానంలో గొడవలకి కొంచెం దూరంగా ఉంటున్నా.. వెలుపల మాత్రం అతని తీరు మారడం లేదు' అని మైకేల్ వాన్ ఈ సందర్భంగా వెల్లడించాడు.
ఇదిలా ఉంటే నాలుగో వన్డేకు స్టోక్స్‌ను పక్కన పెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్.. ఇప్పుడు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు కూడా అతన్ని పక్కన పెట్టే ఆలోచనలో ఉంది. బుధవారం యాషెస్ సిరిస్ కోసం ఎంపిక చేసిన 16 మంది జట్టు సభ్యుల్లో బెన్ స్టోక్స్‌కు చోటు దక్కిన సంగతి తెలిసిందే.