హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తప్పుతాగి ఓ వ్యక్తిని గాయపరిచి చాలా పెద్ద తప్పు చేశాడని ఆ దేశ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండిస్‌తో నాలుగో వన్డేకి ముందు బ్రిస్టల్‌లో స్టోక్స్ నైట్ క్లబ్ పార్టీకి వెళ్లడం, మద్యం సేవించడం అతని క్రమశిక్షణరాహిత్యానికి అద్దంపడుతోందని అన్నాడు.
భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఇలా క్రికెటర్లని వెలుపలికి అనుమతించరని, ఇంగ్లాండ్‌లో మాత్రమే ఈ కల్చర్ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. 'బెన్‌స్టోక్స్ వయసు 26 ఏళ్లు. అతను కొంచెమైనా పరిణతితో ఆలోచించాలి. మ్యాచ్‌కి ముందు అలా మద్యం సేవించి ఒక వ్యక్తిని గాయపరిచి చాలా పెద్ద తప్పు చేశాడు' అని వాన్ అన్నాడు.

'అందుకే అతనిపై ప్రస్తుతం నాకు ఎలాంటి జాలి లేదు. ఇంగ్లాండ్ జట్టు మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల క్రమశిక్షణపై దృష్టి పెట్టాలి. అలా అని హెడ్‌మాస్టర్‌గా పర్యవేక్షించాల్సిన పనిలేదు. క్రికెటర్లు సరదాగా ఉన్నా.. దానికంటూ సమయం, సందర్భం ఉండాలి. అలా ఉండకపోతే గత వారంలో ఏం జరిగిందో అందరం చూశాం' అని పేర్కొన్నాడు.
'ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు పర్యటన నిమిత్తం భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి దేశాలకి వెళితే.. వారు క్రికెటర్లని భద్రత లేకుండా అసలు వెలుపలికి అనుమతించరు. కానీ.. ఇక్కడ ఇంగ్లాండ్ క్రికెటర్లు స్వేచ్ఛగా బయట పార్టీలకి వెళ్తారు. మ్యాచ్‌ల సమయంలో భారత్ లాంటి దేశాల్లో రాత్రివేళ క్రికెటర్లని అసలు వెలుపలికి అనుమతించరు' అని వాన్ వివరించాడు.
నైట్ క్లబ్ బయట ఒక వ్యక్తిని బెన్ స్టోక్స్ చితకబాదుతున్న వీడియోని గురువారం బ్రిటిష్ పత్రిక సన్ న్యూస్ విడుదల కావడంతో ఇంగ్లాండ్ అండే వేల్స్ క్రికెట్ బోర్డు జట్టు నుంచి స్టోక్స్‌ని తాత్కాలికంగా బోర్డు తప్పించిన విషయం తెలిసిందే. ఈ సాక్ష్యం కారణంగా పోలీస్ విచారణలో కూడా స్టోక్స్‌కి తప్పక శిక్ష పడే అవకాశం ఉంది.
ఈ కేసులో అతనికి కనీసం ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నవంబరులో ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కి బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. స్టోక్స్‌తో పాటు ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న అలెక్స్ హేల్స్‌ను ఈసీబీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.