
మూలిగే నక్క మీద తాటికాయ పడడం అంటే ఇదేనేమో. ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను కోల్పోయి పరువు కోసం ఆరాటపడుతున్న ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ గాయాలతో హోబర్ట్ వేదికగా జరిగే చివరిదైన పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరు సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆడుతున్నారు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో స్టోక్స్ గాయంతోనే బ్యాటింగ్ చేశాడని సమాచారం. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా గాయమైందని తెలుస్తోంది. గాయంతో బ్యాటింగ్ చేసినప్పటికీ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో 91 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 66 పరుగులు సాధించాడు. టెస్ట్ కెరీర్‌లో స్టోక్స్‌కు ఇది 24వ హాఫ్ సెంచరీ. దీంతో స్టోక్స్ ఐదో టెస్టు మ్యాచ్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి.
అలాగే మరో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ అయినా జోస్ బట్లర్ కూడా ఐదో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదని సమాచారం. నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సమయంలో బట్లర్ ఏడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. దీంతో స్కానింగ్ కూడా తీపించారని సమాచారం. స్కానింగ్ రిపోర్టును బట్టి బట్లర్ ఐదో టెస్టులో పాల్గొనేది లేనిది తెలియనుంది. కాగా నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బట్లర్ డకౌట్ అయ్యాడు.
ఇప్పటికే గాయంతో యాషెస్ సిరీస్‌లోని తొలి నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడలేకపోయినా ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ కూడా ఆడడం అనుమానంగానే మారింది. హేజిల్‌వుడ్ ఐదో టెస్టు మ్యాచ్‌కు కూడా దూరమ్యే అవకాశం ఉందని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. కాగా ప్రస్తుతం ఇప్పటివరకు ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల్లో అతిథ్య ఆస్ట్రేలియా ఏకపక్ష విజయాలు సొంతం చేసుకుంది. అంతేకాకుండా మరో రెండు టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0 తో కైవసం చేసుకుంది. ప్రస్తుతం సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగుతుండగా ఈ నెల 14 నుంచి హోబర్ట్ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇదే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం.