జొహాన్నెస్‌బర్గ్: క్రికెట్ మైదానంలో ఎందరో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించిన దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ ఓ అత్యంత విషపూరిత పామును చూసి బెంబేలెత్తిపోయాడు. ఆ కొన ఊపిరితో ఉన్న పామును కాపాడదామనుకున్న స్టెయిన్.. అది అత్యంత విషపూరితమైన తెలుసుకుని అక్కడ్నుంచి పలాయనం చిత్తగించాడు.
32ఏళ్ల స్టెయిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తన మిత్రుడితో కలిసి రాత్రి పూట డ్రైవింగ్‌కు వెళ్లిన స్టెయిన్‌కు క్రూగర్ నేషనల్ పార్కు వద్ద రోడ్డుపై గాయపడ్డ పాము కనిపించింది. విషపూరితంకాని బ్రౌన్ హౌస్ స్నేక్‌గా భావించి దాన్ని కాపాడదామని ఇద్దరూ కారు దిగారు.
కానీ, పాముకు దగ్గరైన తర్వాత స్టెయిన్ ఒక్కసారిగా కంగారు పడ్డాడు. తాము డీల్ చేయబోతోంది అత్యంత విషపూరితమైన బ్లాక్ మాంబా(నల్లత్రాచు) అని తెలుసుకొని భయాందోళనకు గురయ్యాడు.
తాము ఎంత ధైర్యవంతులమో తెలిపేందుకు ఈ వీడియో పోస్టు చేయడం లేదని.. మనం దేనితో పెట్టుకుంటున్నామో తెలియనప్పుడు వదిలేయడం చాలా మంచిదని పేర్కొన్నాడు. తాము ఓ గుణపాఠం నేర్చుకున్నామని స్టెయిన్ వ్యాఖ్యానించాడు.