సిడ్నీ: తాను ఆడిన క్రికెటర్లలో స్టీవ్ వా అత్యంత స్వార్థపరుడని ఆస్ట్రేలియా స్ఫిన్ దిగ్గజం షేన్ వార్న్ చేసిన విమర్శలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్పందించారు. 1999లో వెస్టిండిస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో షేన్ వార్న్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడానికి జట్టు ప్రయోజనాలే కారణమని వెల్లడించాడు.
అంతేకాదు ఒక కెప్టెన్‌గా తన బాధ్యతలను నిర్వర్తించానని, ఒక్కో సమయంలో కఠిన నిర్ణయాలు తప్పవని స్టీవ్ వా ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఒక సమాధానంతో షేన్ వార్న్ చేసిన వ్యాఖ్యలను తాను ఖండించలేనని ట్రిపుల్ ఎమ్ కమర్షియల్ రేడియోలో స్టీవ్ వా పేర్కొన్నాడు.
తుది జట్టు నుంచి షేన్ వార్న్‌ను తొలగించాలన్నది కఠిన నిర్ణయమని, అయితే కెప్టెన్‌గా తన విధులను నిర్వర్తించానని చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టు ప్రయోజనాల కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని స్టీవ్ వా అన్నారు.

ఇటీవల ఓ టీవీ ఛానల్‌లో 'ఐయామ్ ఏ సెలబ్రిటీ' కార్యక్రమానికి హాజరైన షేన్ వార్న్ మాట్లాడుతూ తాను ఆడిన క్రికెటర్లలో స్టీవ్ వా అత్యంత స్వార్థపరుడని షేన్‌వార్న్ పేర్కొన్నాడు. స్టీవ్ వాను అత్యంత సెల్ఫిష్ క్రికెటర్ గా అభివర్ణించాడు.
ఈ సందర్భంగా వార్న్ 1999లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ గురించి ప్రస్తావించాడు. ఆ సిరీస్‌లో చివరి టెస్టు మ్యాచ్‌కు తనను స్టీవ్ దూరం చేశాడని, ఆ సమయంలో తాను చాలా నిరాశ చెందానని పేర్కొన్నాడు. సెలక్షన్‌కు ముందు స్టీవ్ వా తనతో నేను ఆడటం లేదని చెప్పాడు. దీంతో ఎందుకు అని నేను ఎదురు ప్రశ్నించినప్పటికీ, కెప్టెన్‌గా చెబుతున్నాను. నువ్వు ఆడటం లేదని స్టీవ్ వా తేల్చి చెప్పాడు.