
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్‌లో జరుగుతుందని తెలిసినప్పటి నుంచి టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారని చర్చ జరుగుతోంది. ఉపఖండ పిచ్‌లపై అత్యంత ప్రమాదకరంగా కనిపించే అశ్విన్.. గతంలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు వాళ్లకు ముచ్చెమటలు పోయించాడు. సాధారణంగానే ఎడం చేతి వాటం బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అశ్విన్.. ఈసారి ఆస్ట్రేలియా టీంలో కనీసం ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండటం చూసి సంతోషిస్తూ ఉండి ఉంటాడు కూడా.
అయితే తాము అశ్విన్ గురించి పెద్దగా భయపడటం లేదని ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. 'మేం ఇప్పటి వరకు చాలా మంది ఆఫ్‌స్పిన్నర్లను ఎదుర్కొన్నాం. వారిలో మహేష్ పితియా ఒకడు. తను అశ్విన్ వేసినట్లే బౌలింగ్ చేస్తాడు. మేం ఈ విషయంలో అతిగా ఏం ఆలోచించడం లేదు. అశ్విన్ క్వాలిటీ బౌలరే కానీ.. మా దగ్గర అతన్ని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని టూల్స్ ఉన్నాయి' అని ధీమా వ్యక్తం చేశాడు. గతంలో భారత గడ్డపై ఈ రెండు జట్లు తలపడినప్పుడు స్మిత్‌ను అశ్విన్ మూడుసార్లు అవుట్ చేశాడు. అయితే అశ్విన్ బౌలింగ్‌లో స్మిత్ కూడా 57 సగటుతో పరుగులు చేయడం గమనార్హం.
ఇక తొలి టెస్టు జరిగే నాగ్‌పూర్ పిచ్‌ను పరిశీలించిన స్మిత్.. దీనిపై కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ పిచ్‌లో అంత గొప్ప బౌన్స్ రాదని వివరించాడు. 'ఒకవైపు పిచ్ చాలా డ్రైగా ఉంది. స్పిన్‌కు సహకారం ఉంటుంది. ముఖ్యంగా ఎడం చేతి వాటం స్పిన్నర్లు కచ్చితంగా బ్యాటర్లను ఇబ్బంది పెడతారు. అంతకుమించి ఈ పిచ్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయా. మ్యాచ్ గడిచేకొద్దీ కొంచెం అటూ ఇటూ బంతి మూవ్‌మెంట్ పెరగొచ్చు' అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.