నేనలా చేసి ఉండాల్సికాదు: డ్రెస్సింగ్ రూమ్ రివ్యూపై సారీ చెప్పిన స్మిత్
హైదరాబాద్: బెంగుళూరు వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో తాను డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి సైగలు చేసిన వివాదంపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. తాను అలా చేసి ఉండాల్సింది కాదని, కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా కూడా అలా వ్యవహరించకూడదని స్మిత్ పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ విలేకరులతో మాట్లాడాడు. 'బంతి నేరుగా వచ్చి నా ప్యాడ్‌కు తాకింది. దీంతో స్ట్రైకర్ బ్యాట్స్‌మన్ కోసం చూశాను. నాన్ స్ట్రైకర్‌తో మాట్లాడాక నేను డ్రెస్సింగ్ రూం వైపు చూశాను. నేను అలా చేసి ఉండాల్సింది కాదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి. నా జట్టు ఆటగాళ్ల వైపు చూశాను. అప్పుడు బుర్ర కొద్దిగా పనిచేయలేదు' అని పేర్కొన్నాడు.
అయితే తాను అలా చేసి ఉండాల్సి కాదని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. ఆ సమయంలో ఏం చేయాలో తోచలేదని అన్నాడు. కోహ్లీతో ఆ సమయంలో చిన్న చర్చ నడిచిందని, అయితే అది సరదాగానే సాగిందని, అది గొడవేమీ కాదన్నాడు. మ్యాచ్‌ల్లో ఇలాంటివి సహజమని, మ్యాచ్ సరైన స్ఫూర్తితోనే సాగిందని స్మిత్ అన్నాడు.

ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీగా స్మిత్
ఇన్నింగ్స్‌లో 21వ ఓవర్లో ఉమేశ్ వేసిన మూడో బంతిని ఎదుర్కొన్న స్మిత్ ఎల్బీడబ్ల్యూగా అవుటైనట్లు భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దీంతో వెంటనే అంపైర్ కెప్టెన్ స్మిత్ అవుటైనట్లు ప్రకటించాడు. వెంటనే భారత్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగారు. వెంటనే రివ్యూ కోరదామని నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న హ్యాండ్స్ కోంబ్‌ను అడిగాడు.
అంపైర్‌కు ఫిర్యాదు చేసిన విరాట్ కోహ్లీ
దీంతో అతడు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపుతూ టీమ్ మేట్స్‌ను సలహా కోరమని సూచించాడు. ఇదంతా సమీపంలో ఉన్న కోహ్లీ గమనించి అంపైర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ఈ సమయంలో అంపైర్ నిగెల్ లాంగ్ కల్పించుకొని అది నిబంధనలకు విరుద్ధమని వారించడంతో మైదానాన్ని వీడి స్మిత్ వెళ్లిపోయాడు.
స్మిత్ తీరుపై మండిపడ్డ ఆస్ట్రేలియా క్రికెటర్లు
దీనిపై డీఆర్ఎస్ వివాదంపై భారత సీనియర్ క్రికెటర్లతోపాటు ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా తప్పుబట్టిన నేపథ్యంలో అతను స్పందించాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ డీఆర్ఎస్‌ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ సిస్టమ్‌గా మార్చేశారని విమర్శించాడు. ఆసీస్‌తో మైదానంలో స్లెడ్జింగ్ చేస్తూ ఆటడం, స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించడం రెండూ వేరేనని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ చీటింగ్‌పై సునీల్ గవాస్కర్ ఇలా
ఈ టెస్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ లక్ష్మణ రేఖను దాటాడని, దీనిపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఇక టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో 'కామెంటరీ బాక్స్‌లో ఉన్న చాలామంది ఈ వివాదం గురించి స్పందించారు. డీఆర్‌ఎస్ రివ్యూ కోరాలా? వద్దా? అనే దానిపై ఆస్ట్రేలియన్లు డ్రెసింగ్ రూమ్ వైపు సైగలు చేస్తున్నారు. అక్కడ ఉన్న తమ కంప్యూటర్ నిపుణుడి సూచనలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా దారుణం. హ్యాండ్స్‌కోంబ్‌తో చర్చించిన తర్వాత కూడా స్మిత్ నిపుణుడి సైగల కోసం డ్రెసింగ్ రూమ్ వైపు చూశాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. దీనిపై ఐసీసీ, మ్యాచ్ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఇలా
'డీఆర్ఎస్ రివ్యూ సమయంలో నేను ఎప్పుడూ ఆడలేదు. అయినప్పటికీ ఇది నిబంధనలకు విరుద్ధం. ఇది మంచిది కాదు' అని ఆసీస్ మాజీ దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు
వీవీఎస్ లక్ష్మణ్ ఇలా
'డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ కోరడం అనేది నిజంగా అసంతృప్తిని కలిగించింది. ఇది క్రీడాస్పూర్తికే విరుద్ధం' అని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications