ఆ ఇద్దరి వల్లే: మూడో వన్డేలో ఓటమిపై స్టీవ్ స్మిత్
హైదరాబాద్: భారత పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో తమ జట్టు భారీ స్కోరు చేయకపోవడానికి భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బూమ్రాలే కారణమని స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు.
డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో వీరిద్దరూ అత్యుత్తమని స్మిత్ కొనియాడాడు. తమకు ఏ దశలోనూ వారు పరుగులు చేసే అవకాశాన్ని ఇవ్వలేదని చెప్పాడు. ప్రధానంగా స్లాగ్ ఓవర్లలో ఆ ఇద్దరి బౌలింగ్‌లో పరుగులు రాబట్టడానికి ఆసీస్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని తెలిపాడు.
మూడో వన్డేలో 38 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 242/2తో పటిష్టంగా ఉంది. ఆ జట్టు 330కిపైగా పరుగులు చేస్తుందని అంతా భావించారు. కానీ ఆరోన్ ఫించ్ 124 పరుగుల వద్ద అవుటయ్యాక ఆ జట్టు పరిస్థితి మారిపోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది.

టీమిండియా బౌలింగ్ అద్భుతంగా ఉంది
ఈ విషయాన్నే స్మిత్ మ్యాచ్ అనంతరం ప్రస్తావించాడు. 'నిన్నటి మ్యాచ్‌లో మా బ్యాట్స్‌మెన్ అనవసరంగా తప్పుడు షాట్లకు పోయారు. ఇక్కడ చెడ్డ బంతుల్లో వికెట్లను సమర్పించుకోవడం బాధనిపించింది. మొత్తంగా టీమిండియా బౌలింగ్ అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో బూమ్రా, భువీలు మమ్మల్ని పరుగులు చేయకుండా నిలువరించారు' అని స్మిత్ పేర్కొన్నాడు.

అనుకున్న స్కోరును బోర్డుపై ఉంచలేకపోయాం
'నిజానికి మేము అనుకున్న స్కోరును బోర్డుపై ఉంచలేకపోయాం. ఆ ఇద్దరి వల్లే మా ప్లాన్ పూర్తిగా దెబ్బతింది. వారిద్దరూ మమ్మల్ని సులువుగా పరుగులు తీయకుండా నియంత్రించారు. దాంతో దూకుడుడా ఆడాల్సి వచ్చింది. వారిద్దరూ అత్యుత్తమ డెత్ ఓవర్ల స్పెషలిస్టులు' అని స్మిత్ కొనియాడాడు.

వారిద్దరూ మరింత ప్రమాదకరంగా మారుతున్నారు
వికెట్ కొద్దిగా నెమ్మదించినప్పుడు వారిద్దరూ మరింత ప్రమాదకరంగా మారతున్నారని స్మిత్ తెలిపాడు. 'తొలి 38 ఓవర్లు అద్భుతంగా ఆడాం. కానీ ఆఖర్లో భువీ, బుమ్రా కారణంగా మా బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడలేకపోయారు. దీంతో భారీ స్కోరు చేయలేకపోయాం' అని స్టీవ్ స్మిత్ వాపోయాడు.

అనుకూలంగా మలుచుకోవడంలో విఫలం అవుతున్నాం
విజయానికి దగ్గరగా వచ్చిన మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం మా జట్టుకు ఓ ట్రెండ్‌గా మారిందని స్టీవ్ స్మిత్ అసహనం వ్యక్తం చేశాడు. 'మ్యాచ్‌లో మంచి స్థితిలో ఉన్నప్పటికీ దాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో విఫలం అవుతున్నాం. ఇండోర్‌లోనూ అలాగే జరిగింది' అని స్టీవ్ స్మిత్ తెలిపాడు.

వచ్చే రెండు మ్యాచ్‌ల్లోనైనా గెలవడానికి ప్రయత్నిస్తాం
'వరుస ఓటములు ఎదురైనప్పుడు జట్టులో స్ఫూర్తి నింపడం కష్టం అవుతుంది. వచ్చే రెండు మ్యాచ్‌ల్లోనైనా గెలవడానికి ప్రయత్నిస్తాం. ఆసీస్ జట్టు తాను ఆడిన చివరి 15 మ్యాచ్‌ల్లో 13 ఓడింది. ఇది అసాధారణం. ఇకనైనా విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది. మరో రెండు నెలల్లో యాషెస్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. అది భిన్నమైన ఫార్మాట్. కానీ మేం గెలవడం ప్రారంభించాలి' అని స్మిత్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications