
సిడ్నీ: ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్ వాయిదాపడి.. ఆ స్థానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 జరిగితే తాను కచ్చితంగా ఆడతానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఈ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న స్మిత్.. ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిస్తే భారత్‌కు ప్రయాణించేందుకు అభ్యంతరం లేదన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్-మేలో జరగాల్సిన ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచకప్ నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
'వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా దేశం తరఫున ప్రపంచకప్ ఆడటమే అత్యున్నత గౌరవం. నా మొదటి ప్రాధాన్యం దానికే. ఒకవేళ టోర్నీ వాయిదాపడి ఐపీఎల్ జరిగితే అందులో ఆడతా. అదో అద్భుతమైన లీగ్. ప్రస్తుతం పరిస్థితులు ఎవరి నియంత్రణలోనూ లేవు. ఇక ఆటగాళ్లంతా చెప్పినట్టు చేయడమే పని. ప్రపంచకప్ వాయిదా పడుతుందో లేదో తెలియదు. జరిగితే గొప్ప. క్రికెట్‌కు పరిస్థితులు అనుకూలించకపోతే చేసేదేమీ లేదు. అప్పటి వరకు ప్రభుత్వం చెప్పినట్టు చేయడమే. ఇంట్లో కూర్చొని ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడమే పని' అని స్మిత్ సోమవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఐసీసీ బంతిని ఉమ్మితో రుద్దడాన్ని నిషేధంచడంపై స్మిత్ స్పందించాడు. 'బ్యాటు, బంతి మధ్య సరైన పోటీ ఉండాలని కోరుకొనే వ్యక్తిని నేను. ఉమ్మితో రుద్దడాన్ని నిషేధించడాన్ని అస్సలు సమర్థించను. ఇందుకు ప్రత్యామ్నాయం కూడా కష్టమే. బంతిపై పట్టు చిక్కేందుకు నా చేతుల్లో ఉమ్మి వేసుకొని రుద్దుతాను. ఏదేమైనప్పటికీ ఇవన్నీ సర్దుకోవాలంటే కొంత సమయం పడుతుంది. దీనిపై ముందుకు వెళ్లేందుకు ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి' అని స్మిత్ అన్నాడు.
'టీమిండియా కన్నా.. పింక్ బంతితో ఎక్కువగా మేమే ఆడాం. వారితో మ్యాచ్‌లో ఈ అనుభవం మాకు పనికొస్తుంది. కానీ భారత జట్టులో పరిస్థితులకు అనుగుణంగా సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే బ్యాట్స్‌మెన్ ఉన్నారు' అని స్మిత్ పేర్కొన్నాడు. అలాగే టీమిండియా కెప్టెన్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడని, లక్ష్య ఛేదనలో అతడి ఆట తీరు తనకెంతో ఇష్టమని స్మిత్ చెప్పాడు. 'కోహ్లీ అంటే నాకు చాలా గౌరవం. అతను అద్భుతమైన ఆటగాడు. అసాధ్యమైన రికార్డులు సాధించాడు. అతను ఇండియా కోసం ఎంతో చేశాడు. భారత జట్టు ఇప్పుడు ఆడుతున్న విధానం వెనుక విరాట్ కోహ్లీ తపన ఎంతో ఉంది' అని స్మిత్ అభిప్రాయపడ్డాడు.