
హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టులో ప్రధాన మార్పు చోటు చేసుకుంది. టాంపరింగ్ వివాదంలో నిజాలు ఒప్పుకోవడంతో స్టీవ్ స్మిత్‌ను ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోమంటూ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కమిషన్ ఆదేశించింది. దీంతో పాటుగా క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్‌లాండ్ స్మిత్ కెప్టెన్సీ తప్పుకుంటాడని కానీ, జట్టులో కొనసాగుతాడంటూ తెలిపారు. జట్టులో ఆడుతున్న వార్నర్ ట్యాంపరింగ్ వివాదం ముదిరిపోకముందే వైస్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాడు.
సదరు కమిషన్ ఆదేశాలనుసారం స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం స్మిత్‌కు ఇదేం మొదటి సారేం కాదు. ఇంత జరిగినా స్మిత్ మీడియాతో మాట్లాడుతూ.. తాను జట్టు గెలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. అంతేకానీ, తానేం తప్పుచేయాలేదంటూ చెప్పుకుంటున్నాడు.
అసలు ట్యాంపరింగ్ జరిగిందిలా..:
శనివారం కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు బెన్ క్రాప్ట్ మైదానంలో ప్రవర్తించిన తీరు కెమెరాల్లో రికార్డు అయింది. ఆసీస్ క్రికెటర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్..బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. అప్పటికీ వెనుకంజలో ఉండటంతో బ్యాల్ ట్యాంపరింగ్ చేసి దక్షిణాఫ్రికా పరుగులు కట్టడి చేద్దామని ప్రయత్నించారు. దీంతో మూడో టెస్టులో ఒక ప్రణాళిక ప్రకారం బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డారు.
ఇలా చేశాడు. :
ఆ జట్టు ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్ రెండో సెషన్లో బంతి ఆకారం దెబ్బ తీసేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అతను పసుపు రంగులో ఉన్న చిన్న ప్లాస్టిక్ ముక్క లాంటి దాన్ని వేళ్ల మధ్య ఉంచుకుని బంతిని గోకడం కనిపించింది. బంతిని రివర్స్ స్వింగ్‌కు అనుకూలంగా మార్చేందుకు అతడిలా చేశాడు. మూడో రోజు(శనివారం) ఆటలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బాన్‌క్రాఫ్ట్ ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడు.