హైదరాబాద్: బెంగుళూరు టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 'బ్రెయిన్ ఫేడ్' చర్యపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్పందించాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న సిరిస్‌లో ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతుంటాయని వాటిని సీరియస్‌గా తీసుకోకూడదని ఆటగాళ్లు, అభిమానులు ఆస్వాదించాలని స్టీవ్ వా సూచించాడు.
'ఇదొక అద్భుతమైన టెస్టు మ్యాచ్. కేవలం ఒక్క సంఘటనపైనే దృష్టిసారించడం నిజంగా దురదృష్టకరం. బెంగుళూరు టెస్టులో తాను తప్పు చేసినట్లు స్టీవ్ స్మిత్ కూడా అంగీకరించాడు. స్టీవ్ స్మిత్ చేసింది తప్పే. అలా చేసి ఉండాల్సింది కాదు. మళ్లీ స్మిత్ ఆ తరహా తప్పు చేస్తాడని నేను అనుకోవడం లేదు. ఆ టెస్టులో అంఫైర్లు ముందుగా కలగజేసుకుని ఆటగాళ్లకు సర్ది చెప్పడం శుభపరిమాణం. ఈ ఉదంతం నుంచి స్టీవ్ స్మిత్ ఓ పాఠాన్ని నేర్చుకుంటాడు' అని వా అన్నాడు.

మార్చి 8న ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న స్టీవ్ వా స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ 'చీటింగ్' ఘటనతో ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు దిగువస్థాయికి చేరుకున్నాయన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు ఒకరి గురించి ఒకరికి తెలుసు. ఐపీఎల్‌లోనూ కలిసి ఆడుతున్నారని ఆటగాళ్లు స్నేహపూర్వకంగానే ఉంటారని స్టీవ్ వా చెప్పాడు.
స్టీవ్‌స్మిత్ డీఆర్ఎస్ ఘటనను ప్రత్యక్షంగా చూడలేదని అయితే వీడియోలో వీక్షించినట్టు స్టీవ్ వా తెలిపారు. ప్రస్తుత రోజుల్లో స్టేడియంలో ఎటువంటి చిన్నతప్పు చేసినా కెమెరాలకు దొరికిపోతున్నారని అందుకే జాగ్రత్తగా ఉండాలని ఆటగాళ్లకు సూచించాడు. ఫుట్‌బాల్ మాదిరి క్రికెట్‌లోనూ రెడ్‌కార్డ్ తీసుకురావడంపై అంపైర్లకు మరిన్ని అధికారాలు వస్తాయని క్రికెటర్లు జాగ్రత్తగా ఉండాలని అన్నాడు.
మరోవైపు ఈ వివాదంలో స్మిత్, కోహ్లీపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఐసీసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. 'బెంగళూరు టెస్టులో జరిగిన ఘటనల విషయంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఏ ఆటగాడిపై కూడా ఆరోపణలు నమోదు చేయడం లేదని ఐసీసీ నిర్ధారిస్తోంది. స్టీవ్ స్మిత్, కోహ్లికి సంబంధించి జరిగిన రెండు సంఘటనలు కూడా మ్యాచ్‌లో భాగంగానే ఐసీసీ చూస్తోంది కాబట్టి ఆటగాళ్లపై తదుపరి ఎలాంటి చర్యలు ఉండవు. ఇరు జట్ల ఆటగాళ్ల భావోద్వేగాలు కూడా కీలక పాత్ర పోషించిన అద్భుతమైన టెస్టు మ్యాచ్‌ను మనం చూశాం. రాంచీలో జరిగే మూడో టెస్ట్‌పైనే దృష్టిసారించాలని ఇరు జట్లకూ సూచిస్తున్నాం. టెస్ట్ ఆరంభానికి ముందు మ్యాచ్ రెఫరీ ఇరు జట్ల కెప్టెన్లనూ పిలిచి వారి బాధ్యతలను గుర్తు చేస్తాడు' అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ చెప్పాడు.