
హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఓ ఇంటివాడయ్యాడు. గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్న తన గర్ల్ ప్రెండ్, చిన్ననాటి స్నేహితురాలైన డాని విల్లీస్‌ను సన్నిహితుల సమక్షంలో శనివారం స్టీవ్ స్మిత్ వివాహం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియాలోని సదరన్ హైలాండ్స్‌లో వీరి విహవాం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మెల్ బోర్న్ వేదికగా జరిగిన అలెన్ బోర్డర్ కార్యక్రమం అనంతరం డాని విల్లీస్ గురించి తొలిసారి స్పందించిన స్మిత్ త్వరలోనే తాము వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నామని వెల్లడించాడు.
అయితే, ఆ తర్వాత మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బాల్ టాంపరింగ్‌కి పాల్పడిన ఉదంతంలో స్టీవ్‌స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రను ఈ బాల్ టాంపరింగ్ మసకబారేలా చేసింది.
దీంతో స్టీవ్ స్మిత్ వివాహంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. స్మిత్‌ని బాగా అర్థం చేసుకున్న డాని విల్లీస్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. "నా ఆప్త మిత్రురాలిని ఈరోజు నేను వివాహం చేసుకున్నాను. ఇదే నా జీవితంలో మధురమైన రోజు" అని స్మిత్ తన ఇనిస్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు.