హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన ప్రేయసి డాని విల్స్‌తో నిశ్చితార్థం జరిగినట్లు స్మిత్ ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇంతకీ ఈ నిశ్చితార్ధం ఎక్కడ జరిగిందో తెలుసా?. న్యూయార్క్ నగరంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టాప్ ఆఫ్ ద రాక్ పైన.
ఎన్నో అంచనాలతో ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ తన ప్రేయసి డాని విల్స్‌తో కలిసి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సందడి చేస్తున్నారు. అక్కడే స్మిత్ పెళ్లి ప్రతిపాదనను తీసుకొచ్చాడు. దీనికి ఆమె అంగీకరించడంతో న్యూయార్క్ నగరంలోని అబ్జర్వేషన్ డెక్ 'టాప్ ఆఫ్ ది రాక్'పై సెల్ఫీ తీసుకుని తన ఆనందాన్ని ఇన్‌స్ట్రామ్ ద్వారా వెల్లిబుచ్చాడు.
2012లో బిగ్‌బాష్ లీగ్ జరిగే సమయంలో ఓ బార్‌లో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇటీవలే డాని విల్స్ ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఈ క్రమంలో గురువారం స్టీవ్ స్మిత్.. డాని వద్ద పెళ్లి ప్రపోజల్ తీసుకురాగా ఆమె అంగీకారం తెలిపింది.
దీంతో ఆనందంలో స్మిత్ వెంటనే డాని చేతికి ఉంగరం తొడిగాడు. దీనికి సంబంధించిన ఫొటోను స్మిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి 'డానిని పెళ్లి చేసుకుంటానని మోకాలిపై నిల్చుని అడుగుతూనే ఉన్నాను. కానీ, చివరికి ఆమె ఇప్పుడు ఒప్పుకుంది' అనే క్యాప్షన్‌తో పోస్టు చేశాడు.
స్మిత్ పోస్టు చేసిన ఫోటోని డాని కూడా తన ఇనిస్టాగ్రామ్‌లో 'ఇది ఎప్పటికీ బిగినింగ్' అంటూ క్యాప్షన్‌తో అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే 26 ఏళ్ల డాని విల్స్ మెక్వారీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య అభ్యసిస్తోంది. స్మిత్ ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో పలువురు భారతీయ అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న స్మిత్ వన్డేల్లో 13వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌కు కెప్టెన్‌గా కూడా వ్వవహరిస్తున్నాడు. గతేడాది బోస్టన్‌లో రెడ్ సాక్స్ జట్టుకు చెందిన రెండో బేస్ స్టార్ డస్టింగ్ పెట్రోడియాను కలిసిన సంగతి తెలిసిందే. మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియాతో జీతాల కోసం సాగుతున్న గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.
జులై 1 నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ల కొత్త కాంట్రాక్టులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అప్పటిలోగా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మధ్య ఓ ఒప్పందం కుదరడం దాదాపు అసాధ్యమని ఏసీఏ ప్రతినిధి గ్రెగ్ కంబెట్ స్పష్టం చేశాడు. జూన్ 30తో ప్రస్తుత ఒప్పందం ముగియనుంది.
కనీస అవసరాల విషయంలో ప్లేయర్స్‌కి, క్రికెట్ బోర్డుకి మధ్య చర్చలు సఫలం కాలేదని, దీంతో నిరుద్యోగులుగా కావడానికి ప్లేయర్స్‌ను మానసికంగా సిద్ధం చేశామని గ్రెగ్ కంబెట్ చెప్పాడు. దీంతో జులై 1న సుమారు 200 మంది వరకు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.