
టీమిండియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉత్కంఠగా సాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే మూడో టెస్టులో రెగ్యులర్ సారధి ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్‌కు జట్టు పగ్గాలు అందించారు. తల్లి అనారోగ్యం పాలవడంతో కమిన్స్ స్వదేశానికి వెళ్లాడు. దీంతో జట్టు పగ్గాలు అందుకున్న స్మిత్ అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియాను గెలిపించాడు.
ఇండోర్ టెస్టు విజయంతో ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్) ఫైనల్ కూడా చేరింది. ఈ ఫైనల్‌లో రెండో బెర్తు కోసం భారత జట్టు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ బెర్తు కావాలంటే అహ్మదాబాద్ వేదికగా జరిగే నాలుగో టెస్టులో భారత్ గెలిచి తీరాలి. కమిన్స్ స్వదేశం నుంచి ఇంకా రాకపోవడంతో నాలుగో టెస్టులో కూడా ఆసీస్ జట్టు సారధ్య బాధ్యతలను స్టీవ్ స్మిత్ నిర్వర్తిస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్‌లో భారత్ తయారు చేసిన పిచ్‌ను స్టీవ్ స్మిత్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు.
పిచ్‌ను భూతద్దంలో చూస్తున్నట్లు మోకాళ్లపై కూర్చొని ఉన్న స్మిత్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అహ్మదాబాద్ పిచ్‌కు చాలా దగ్గరగా మొఖం పెట్టి పరిశీలిస్తున్న స్టీవ్ స్మిత్ కనిపిస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో కూడా స్మిత్ ఇలాగే పిచ్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. కానీ ఆ పిచ్‌లపై బ్యాటింగ్ చేయలేకపోయాడు.
మరి అహ్మదాబాద్ పిచ్‌ను కూడా ఇంత సీరియస్‌గా పరిశీలిస్తున్న స్మిత్.. ఈ మ్యాచ్‌లో కూడా విఫలం అవుతాడా? లేక మంచి స్కోరు చేస్తాడా? అని తెలియాలంటే మ్యాచ్ మొదలయ్యే వరకూ ఎదురు చూడక తప్పదు. ఈ మ్యాచ్‌లో కనుక భారత్ గెలిస్తే టీమిండియా కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది.