
సిడ్నీ: క్రికెట్ ఆటలో కొన్ని సార్లు ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. బ్యాట్స్‌మన్ భారీ ఇన్నింగ్స్ ఆడడమో, బౌలర్ సంచలన బౌలింగ్ చేయడమో లేదా ఫీల్డర్ అనుకోకుండా అద్భుత క్యాచ్‌లు పట్టడమో జరుగుతుంటుంది. తాజగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టివ్ స్మిత్ బౌలింగ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలోని షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో స్టీవ్ స్మిత్ ఖాతాలోకి అనుకోకుండా ఓ వికెట్ చేరింది.
తాజాగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా న్యూసౌత్‌వేల్స్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. న్యూసౌత్‌వేల్స్‌కు ఆడుతున్న స్మిత్ బౌలింగ్ వేయగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన జోష్ ఇంగ్లిస్ డ్రైవ్ షాట్ ఆడాడు. బంతి సిల్లీ పాయింట్ ఫీల్డర్‌కు తగిలి గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న షార్ట్‌లెగ్ ఫీల్డర్ బంతిని అందుకోవడంతో ఇంగ్లిస్ ఔటయ్యాడు. ఇలాంటి ఔట్ క్రికెట్‌లో సాధారణమే అయినా.. వీడియో చూస్తే మాత్రం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ మ్యాచ్‌లో ఆరు ఓవర్లు వేసిన స్మిత్ రెండు మెయిడిన్లు చేశాడు. పది పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అంతేకాదు స్మిత్ 1.66 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన స్మిత్ సెంచరీ (103)తో రాణించాడు. స్మిత్ అద్భుత ప్రదర్శనతో న్యూసౌత్‌వేల్స్ 223 పరుగులతో విజయం సాధించింది.
స్టీవ్ స్మిత్ ప్రస్తుతం ప్రపంచ టాప్-ర్యాంక్ టెస్ట్ బ్యాట్స్‌మన్. ఏడాది నిషేధం అనంతరం బరిలోకి దిగిన స్మిత్ పరుగుల వరద పారిస్తున్నాడు. 64.56 సగటుతో టెస్టుల్లో 6973 పరుగులు చేసాడు. ఇక బౌలింగ్‌లో 17 వికెట్లు కూడా సాధించాడు. ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌తో నవంబర్ 21 నుంచి డిసెంబర్ 3 వరకు రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. పాకిస్థాన్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు సిద్ధం కావడానికి షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో స్మిత్ ఆడుతున్నాడు.