
హైదరాబాద్: బాల్ టాంపరింగ్‌కు పాల్పడి దేశం పరువు తీసిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఆస్ట్రేలియాకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా కూడా క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది.
ఇక, మూడో టెస్టులో బాల్ టాంపరింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన కామరూన్ బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. ఈ నిషేధంతో స్మిత్, వార్నర్‌లు ఆసీస్ తరుపున ఏ మ్యాచ్‌లోనూ పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. భారత్‌లో ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
స్మిత్, వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన నేపథ్యంలో వారిద్దరినీ ఐపీఎల్‌లో ఆడనిచ్చేది లేదని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'బాల్ టాంపరింగ్ విషయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై సీఏ కఠిన చర్యలు తీసుకుంది. దీంతో స్మిత్, వార్నర్‌లపై ఐపీఎల్‌లోనూ ఈ నిషేధం కొనసాగుతుంది' అని అన్నారు.

ఇక, ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఈ విషయమై మాట్లాడుతూ 'స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ స్థానంలో సదరు ప్రాంఛైజీలు మరో ఆటగాడిని తీసుకోవచ్చని' అని ఆయా ప్రాంఛైజీలకు సూచించారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు స్మిత్ కెప్టెన్సీ వహిస్తుండగా.. సన్‌రైజర్స్ జట్టుకు వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ స్థానంలో రహానేను రాజస్థాన్ యాజమాన్యం నియమించగా... తాజాగా బుధవారం డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు సన్‌రైజర్స్ సీఈఓ షణ్ముగమ్ ట్విటర్ ద్వారా ప్రకటించారు.
దీంతో కెప్టెన్ రేసులో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు ఉన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ ఎంపికైతే ఈ ఐపీఎల్ సీజన్‌లో అన్ని జట్లకు కెప్టెన్లుగా భారత ఆటగాళ్లే ఉంటారు. ఇలా జరగడం ఐపీఎల్‌లో ఇదే తొలిసారి అవుతుంది.