
హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లతో రాణించాడు. తొలి టెస్టులో వికెట్లు తీయలేని స్పిన్నర్లు రెండో టెస్టులో విజృంభించారు. రెండో టెస్టులో తొలి రోజు స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా 7 వికెట్లు పడగొట్టారు.
భారత్ Vs శ్రీలంక రెండో టెస్టు మ్యాచ్ స్కోరు కార్డు
122/3 పరుగులతో పటిష్టంగా ఉన్న శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను అశ్విన్ కుప్పకూల్చాడు. కరుణరత్నే (51) అవుటైన తర్వాత శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయి 205 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీసేన తొలిరోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లు ఆడిన టీమిండియా వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్(2), ఛటేశ్వర్ పుజారా(2) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లంకపై ఆధిక్యం సాధించేందుకు భారత్ ఇంకా 194 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో తిరిమన్నేను పెవిలియన్ చేర్చిన అశ్విన్ వ్యక్తిగతంగా రికార్డును నెలకొల్పాడు.
మూడు ఫార్మాట్లు కలిపి అశ్విన్ బౌలింగ్‌లో ఎక్కువ సార్లు అవుటైన బ్యాట్స్‌మెన్‌గా తిరుమన్నే నిలిచాడు. అశ్విన్ ఇప్పటి వరకు తిరుమన్నేను 12సార్లు పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి స్థానంలో 11 సార్లు అవుటైన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు.
ఇప్పటివరకు అశ్విన్ చేతిలో ఎక్కువసార్లు అవుటైన జాబితాలో వార్నర్ ఉండగా... ఇప్పుడు ఆ స్ధానాన్ని తిరుమన్నే ఆక్రమించాడు. తిరుమన్నేను వన్డేల్లో ఆరుసార్లు, టెస్టుల్లో ఐదుసార్లు, టీ20ల్లో ఒకసారి చొప్పున అశ్విన్ ఔట్ చేయడం విశేషం.
ఇంగ్లాండ్ క్రికెటర్ అలెస్టర్ కుక్, డారెన్ బ్రావో, బెన్ స్టోక్‌లు అశ్విన్ బౌలింగ్‌లో తొమ్మిది సార్లు చొప్పున ఔటయ్యారు. విండీస్ బ్యాట్స్‌మెన్ మార్లోన్ శ్యామూల్స్‌ను అశ్విన్ 8 సార్లు పెవిలియన్ చేర్చాడు. ఇదిలా ఉంటే టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయికి అశ్విన్ మరో 4 వికెట్ల దూరంలో నిలిచాడు.
నాగ్‌పూర్ టెస్టు: తొలిరోజు మ్యాచ్ హైలెట్స్
* 2017లో టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన ఓపెనర్‌గా కరుణరత్నే నిలిచాడు. లంక తరఫున ఒకే ఏడాదిలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో ఓపెనర్ కూడా కరుణరత్నే.
* అంతకముందు జయసూర్య మాత్రమే శ్రీలంక తరుపున 1997, 2004లో వెయ్యికి పైగా పరుగులు నమోదు చేశాడు.
* టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయికి అశ్విన్ మరో 4 వికెట్ల దూరంలో నిలిచాడు.
* 2017లో టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ 48 వికెట్లు తీశాడు. ఓ భారత బౌలర్ ఓ ఏడాదిలో తీసిన అత్యధిక వికెట్ల సంఖ్య ఇదే కావడం విశేషం.
* 47 వికెట్లతో రవీంద్ర జడేజా రెండో స్ధానంలో ఉన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.