
చెన్నై: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో క్రికెట్ వ్యాఖ్యాతగా మారి అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో సరసన కూర్చొని తన గొంతుని వినిపించాడు. వ్యాఖ్యానం చేయడం ఇదే మొదటిసారి అయినా.. ఎక్కడా తడబడలేదు. మ్యాచ్ అప్‌డేట్స్, సౌథాంప్టన్ వాతావరణ పరిస్థితులను కార్తీక్ అభిమానులకు తెలియజేశాడు. అయితే కొత్తగా ఈ ప్రయాణం మొదలు పెట్టడానికి గల కారణాలను దినేశ్ కార్తీక్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో వెల్లడించాడు.
'వ్యాఖ్యాతగా మారడం అనేది నేను మాటల్లో వర్ణించలేను. క్రికెట్‌లోని మరో కోణాన్ని చూడటానికే నేను ఈ ప్రయాణాన్ని మొదలెట్టాను. మీ నుంచి వచ్చిన ప్రేమాభిమానాలు, మద్ధతు ఈ ప్రయాణాన్ని మరింత ఉన్నతంగా మార్చాయి. మీరంటే నాకెంతో ఇష్టం. మిమ్మల్ని అలరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటా' అని దినేశ్ కార్తీక్ ఓ వీడియో పంచుకున్నాడు. అందులో క్రికెట్ వ్యాఖ్యాతగా సాగిన ఆరు రోజుల తన ప్రయాణాన్ని వివరించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ సమయంలో దినేశ్ కార్తీక్ కామెంట్రీ పట్ల ఫాన్స్ ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా అతడి వ్యాఖ్యానంపై ప్రశంసల జల్లు కురిపించారు. కార్తీక్ కామెంటేటర్‌గా దుమ్మురేపుతున్నాడని, భారత తరఫున డీకే కామెంటరీ బాక్స్‌లో ఆకట్టుకుంటున్నాడని ట్వీట్లు చేశారు. డీకే వ్యాఖ్యనంకు అభిమానులే కాదు.. కామెంటేటర్‌లు కూడా ఫిదా అయ్యారు. భారత ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే.. కార్తీక్ కామెంటరీపై స్పందించాడు. 'దినేష్ కార్తీక్ తొలిసారి వ్యాఖ్యానం చేసినా.. చాలా బాగుంది. నేను ఫిదా అయ్యా' అని ట్వీట్ చేశాడు. మొత్తానికి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కార్తీక్ అదరగొట్టాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ వ్యాఖ్యాన బృందంలో భారత్ నుంచి సన్నీ, డీకేలకే చోటు దక్కింది.
దినేశ్ కార్తీక్ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఇక 203 ఐపీఎల్ మ్యాచులను ఆడాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో డీకే చివరిసారి ఆడాడు. న్యూజిలాండ్‌తో ఆడిన సెమీఫైనల్లో విఫలమైన డీకే.. కేవలం 6 పరుగులు చేశాడు. దాంతో అప్పటి నుంచి డీకేను భారత్ తుది జట్టులోకి తీసుకోలేదు. అయితే ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో చోటు కోసం అతడు ప్రయత్నిస్తున్నాడు. ఇక ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా ప్రాంచైజ్ తరఫున కార్తీక్ ఆడుతున్న విషయం తెలిసిందే.