
ఐపీఎల్ 2020 నిర్వహణపై నీలినీడలు:
కరోనా కారణంగా ఐపీఎల్ 2020 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే స్టేడియంలలో ఆడియన్స్‌ని అనుమతించకుండా.. తగిన జాగ్రత్తలతో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని కొందరు క్రికెట్ విశ్లేషకులు సూచనలు చేశారు. అయితే ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ ఆడటం చాలా విచిత్రమైన అనుభవాన్ని కలిగిస్తుందని టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇ-కాంక్లేవ్ 2020 సందర్భంగా బుధవారం ఇండియా టుడేతో రోహిత్ మాట్లాడాడు. 'ప్రతిఒక్కరూ సురక్షితంగా ఉన్నారని, మార్గదర్శకాలను అనుసరిస్తారని ఆశిస్తున్నా. ఇలాచేసి చివరికి మనం కరోనాపై విజయం సాదించి మన పనులను ప్రారంభించుకోవచ్చు' అని తెలిపాడు.

ఖాళీ స్టేడియంలో ఆడటం విచిత్రంగా ఉంటుంది:
'ఖాళీ స్టేడియంలో క్రికెట్ ఆడటం విచిత్రంగా ఉంటుంది. అభిమానులు అందుకు ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను. నా చిన్నతనంలో ఎవరూ లేని చోట క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడిని. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందని నాకు అనిపిస్తుంది. ఐపీఎల్ టోర్నీపై బోర్డు ఏ నిబంధనలతో ముందుకొస్తుందో.. వాటిని పాటించక తప్పుదు. ఇలా చేస్తే.. కనీసం అభిమానులు మమ్మల్ని టీవీలో అయినా చూస్తారు. వారికి అది కాస్త ఊరటనిస్తుంది' అని రోహిత్ అన్నాడు.

ఎవరూ బయటకు వెళ్లకుండా చూడాలి:
ఆటగాళ్లకు ప్రమాదం జరగకుండా ఉండటానికి లీగ్‌ను ఒకే నగరంలో లేదా రెండు నగరాల్లో నిర్వహించాలని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఐపీఎల్‌కు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే ముందు మనమందరం ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాల కోసం వేచి ఉండాలని రోహిత్ పేర్కొన్నాడు. 'మ్యాచ్‌ల షెడ్యూల్ ఒకసారి నిర్ణయించిన తర్వాత మ్యాచ్‌లు నిర్వహించే చోట తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ నగరం అయినా రద్దీ లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే.. వైరస్ వ్యాపించకుండా ఉంటుంది. ఆటగాళ్లు నివసించే హోటల్ పరిసరాల్లో తగిన భద్రత ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఖాళీ సమయంలో ఎవరూ బయటకు వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలి' అని భారత ఓపెనర్ చెప్పుకొచ్చాడు.

ఆసీస్ బలం పెరిగింది:
స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ పునరాగమనంతో ఆస్ట్రేలియా జట్టు పటిష్ఠంగా మారిందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. 2018-19 భారత జట్టు తమ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆసీస్ గడ్డపై ఆసీస్‌ను ఓడించి టెస్టు సిరీస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో జాతీయ జట్టుకు దూరమైన ఆ ఇద్దరు ఆటగాళ్లు తిరిగి రావడంతో ప్రస్తుతం ఆ జట్టు బలంగా మారింది. అయితే ఈ ఏడాది చివర్లో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు టీమ్ఇండియా ఆసీస్ వెళ్లనుంది.


Click it and Unblock the Notifications












