న్యూఢిల్లీ: ఐపియల్ 8లో యువరాజ్ సింగ్ వరుసగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ అన్ని విభాగాల్లో విఫలమై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ చేతిలో ఆదివారం జరిగిన మ్యాచులో చిత్తయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ బౌలింగులోనూ బ్యాటింగులోనూ ఢిల్లీని ఉతికి ఆరేసింది.
స్టార్క్ (3/20), ఆరోన్ (2/24), వీస్ (2/18) మెరుపులకు వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 నాటౌట్) విజృంభణ తోడుకావడంతో బెంగళూరు 10 వికెట్ల తేడాతో ఢిల్లీపై ఘన విజయం సాధించింది. ఢిల్లీ 18.2 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బెంగళూరు 10.3 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ (35 నాటౌట్) కూడా రాణించాడు. ఆరోన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.

ఓపెనర్లు క్రిస్ గేల్-విరాట్ కోహ్లీ ఎలాంటి తడబాటు లేకుండా ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 99 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో బెంగళూరు సునాయససంగా విజయం సాధించింది. గేల్ (29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇక 11వ ఓవర్‌లో కోహ్లీ రెండు బౌండ్రీలతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు నేపాల్ భూకంప మృతులకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఇక బెంగళూరు పేసర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్ విలవిల్లాడింది. మయాంక్ అగ ర్వాల్, కేథార్ జాదవ్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ప్రమాదకర శ్రేయాస్ అయ్యర్ (0)ను అవుట్ చేసి స్టార్క్ ఢిల్లీ పతనానికి బీజం వేశాడు. ఆనక కెప్టెన్ డుమినీ (13) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతను వీస్ బౌలింగ్‌లో అవుట్‌సైడ్ ఆఫ్ బంతిని వెంటాడి క్యాచ్ అవుటయ్యాడు.
ఆరోన్ అద్భుత బంతితో యువీ (2)ని పెవిలియన్ చేర్చాడు. ఆరోన్ విసిరిన షాట్‌లెంగ్త్ బంతి గంటకు 146 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. యువీ షాట్ ఆడడానికి ప్రయత్నించగా బంతి ఎడ్జ్ తీసుకుని నేరుగా కీపర్ చేతిలోకి వెళ్లింది. తర్వాతి బంతికే మాథ్యూస్ (0) డకౌటయ్యాడు.
ఢిల్లీ 39 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మయాంక్ (27) ఆదుకునే ప్రయత్నం చేసినా అతణ్ణి ఇక్బాల్ వెనక్కి పంపాడు. చివర్లో కల్టర్‌నైల్ (4), మిశ్రా (2), నదీమ్ (2) కూడా నిరాశపర్చారు. ముత్తుస్వామి రనౌట్ కావడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది.