
ముంబై: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి ఫైనల్ మ్యాచ్ జరుగుతుండడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. మాజీలు ఇప్పటికే తమతమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇక ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సౌథాంప్టన్‌లో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఉన్నా.. దానిపై ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచులో ప్రేక్షకులకు అనుమతి ఉన్నా లేకున్నా.. టీవీ, మొబైల్లో ఈ పోరుకు గణనీయమైన వీక్షణలు వస్తాయని బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ అభిప్రాయపడుతోంది. ఇందుకోసం భారీగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫైనల్ మ్యాచ్‌ను భారత్‌లోని ప్రాంతీయ భాషల్లోనూ ప్రసారం చేసేందుకు స్టార్ స్పోర్ట్స్ చర్యలు చేపట్టిందట. హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో మంచును ప్రసారం చేయనున్నారట. దీనిపై ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇదే నిజమయితే.. ఓ టెస్టు మ్యాచును ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయడం ఇదే తొలిసారి కానుంది.
ఇక టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం స్టార్ స్పోర్ట్స్‌కు స్పాన్సర్ల ద్వారా భారీ ఆదాయం సమకూరినట్లు సమాచారం తెలుస్తోంది. ఫైనల్ కోసం 15 కంపెనీలు సంతకం చేశాయట. బైజూస్, డ్రీమ్ 11, కార్స్ 24, థమ్స్ అప్, స్కోడా, ఎంఆర్ఎఫ్, క్రెడ్, పాలసీ బజార్, ఫార్మా ఈజీ, నియో సొల్యూషన్స్, అల్ట్రాటెక్ వంటి స్పాన్సర్లను లిస్టులో ఉన్నట్లు నివేదికలు చెపుతున్నాయి. స్పాన్సర్లు 10 సెకన్ల ప్రకటన కోసం రూ 2.5 లక్షలు చెల్లించబోతున్నారట. సాధారణంగా భారత్ ఆడే టెస్టు మ్యాచ్‌తో పోలిస్తే.. ఇది రెట్టింపని తెలుస్తోంది. ఈ స్పాన్సర్స్ ద్వారా ప్రసారదారుకు దాదాపు రూ 80-85 కోట్ల ఆదాయం రానుందట. ఇక ఒక టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐకి రూ 52 కోట్లు చెల్లిస్తోంది స్టార్ స్పోర్ట్స్.
న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. కఠిన క్వారంటైన్ శనివారం ముగియడంతో.. ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యారు. దాదాపు మూడు వారాల తర్వాత టీమిండియాకు ఇదే తొలి ట్రైనింగ్ సెషన్ కావడంతో.. ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. మరోవైపు గత నెలలోనే ఇంగ్లీష్ గడ్డపైకి కేన్ సేన అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌తో కివీస్ రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది.