
టీమిండియా మాజీలకు చోటు:
ఐపీఎల్ 2021 రెండో దశలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్న వారి పేర్లను స్టార్ స్పోర్ట్స్ ఆదివారం ప్రకటించింది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో కామెంటరీ చేయనున్న వారి పేర్లను వెల్లడించింది. ఆంగ్ల భాషలో హర్ష భోగ్లే, సునీల్ గవాస్కర్, నిక్ నైట్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, ఇయాన్ బిషప్ ఉన్నారు. ఇక హిందీ కామెంటేటర్స్ ప్యానెల్లో గౌతమ్ గంభీర్, పార్థివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రాలు ఉన్నారు. ఇంగ్లీష్, హిందీ బాగా మాట్లాడగల సంజయ్ మంజ్రేకర్‌కు మాత్రం అవకాశం దక్కలేదు. ఇందుకు కారణం అతడి నోటిదూల అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవల వ్యాఖ్యాతగా మారిన దినేష్ కార్తీక్ మ్యాచులు ఆడనుండడంతో అతడి కామెంటరీని మిస్ అవవనున్నాం. అయితే టీమిండియా మాజీలు గంభీర్, పార్థివ్, ఇర్ఫాన్ అభిమానులను అలరించనున్నారు.

నోటిదూల కారణంగా:
సంజయ్ మంజ్రేకర్‌కు మంచి క్రికెట్ పరిజ్ఞానం ఉంది. అంతకుమించి ఇంగ్లీష్, హిందీ భాషలో గలగలా మాట్లాడుతూ అద్భుతంగా కామెంటరీ చేయగలడు. అయితే ఆ కామెంటరీకి కొన్ని సందర్భాల్లో వివాదాస్పద పదాలు జోడించడంతో.. వివాదంలో చిక్కుకున్నాడు. గతంలోనూ ఐపీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ని 'మతిలేని క్రికెటర్' అంటూ సెటైర్ వేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో 'బిట్స్ అండ్ పీసెస్' అంటూ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తీవ్రంగా బదులిచ్చాడు. ఇక సహచర కామెంటేటర్ హర్షా భోగ్లాని హేళన చేస్తూ మాట్లాడినప్పుడు పెద్ద దుమారం చెలరేగింది. మంజ్రేకర్‌కు ఉన్న నోటిదూల కారణంగా అతనిపై బీసీసీఐ వేటు వేసింది. బీసీసీఐ తనని కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పిండంపై మంజ్రేకర్ క్షమాపణలు కోరాడు. ఇక ఐపీఎల్ 2020కి కామెంట్రీ ఫ్యానల్‌ని బీసీసీఐ ప్రకటించబోతున్న సమయంలో కూడా తనని తీసుకోవాలని అభ్యర్థిస్తూ బోర్డుకి ఓ లేఖ రాశాడు. అయినా కూడా బీసీసీఐ ఐపీఎల్ 2020 కోసం అతడిని పరిగణలోకి తీసుకోలేదు. అప్పటినుంచి వేటు కొనసాగుతోంది.

4న టోర్నీ వాయిదా:
ఐపీఎల్ 2021 ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైనప్పటికీ.. కరోనా కేసులు నమోదైన కారణంగా మే 4న టోర్నీ వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. అయితే టోర్నీలో ఆగిపోయిన మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభించనట్లు వెల్లడించింది. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను యూఏఈ చేర్చగా.. వారంతా ప్రాక్టీస్ మొదలెట్టేశారు. ఐపీఎల్ 14వ సీజన్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ .. 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ 8 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుంది. ఆ తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లు 7 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లు సాధించాయి.

ఇంగ్లీష్ కామెంటేటర్స్ ప్యానెల్:
హర్ష భోగ్లే, సునీల్ గావస్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, మురళీ కార్తిక్, దీప్ దాస్‌గుప్తా, అంజుమ్ చోప్రా, ఇయాన్ బిషబ్, అలన్ విల్కిన్స్, పుమెలీలో మబాంగ్వా, నికోలస్ నైట్, డానీ మోరిసన్, సిమోన్ డౌల్, మ్యాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్.
హిందీ కామెంటేటర్స్ ప్యానెల్: జతిన్ సప్రు, సురెన్ సుందరమ్, ఆకాశ్ చోప్రా, నిఖిల్ చోప్రా, తన్యా పురోహిత్, ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్, పార్థివ్ పటేల్, కిరణ్ మొరే.


Click it and Unblock the Notifications












