మరికొన్ని రోజుల్లోనే ఆసియా కప్ మొదలవుతుంది. అది ముగిసిన తర్వాత పెద్దగా ఆలోచించుకునే సమయం లేకుండానే వన్డే వరల్డ్ కప్ వచ్చేస్తుంది. కాబట్టి ప్లేయర్లు అందరూ ఇప్పటి నుంచే ఈ రెండు టోర్నీలకు రెడీ అవుతున్నారు. ఈ ప్రిపరేషన్స్‌లో భాగంగా బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ నయీం షేక్ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో ఒత్తిడికి గురైన జట్టు ఓటమి ఎదుర్కోక తప్పదు. ఈ విషయం చాలాసార్లు రుజువైంది. ఎవరు ముందుగా ఒత్తిడికి తలొగ్గితే వాళ్లే ఓటమి చవిచూస్తారు. కాబట్టి ఒత్తిడిని తట్టుకొని చివరి వరకు పోరాడటాన్ని ఆటగాళ్లు అలవాటు చేసుకోవాలి. దీని కోసం చాలా మంది ప్లేయర్లు మైండ్ ట్రైనింగ్ చేస్తున్నారు.

బంగ్లా ఓపెనర్ నయీం షేక్ కూడా ఇదే పని చేశాడు. అయితే ఈ మైండ్ ట్రైనింగ్‌లో భాగంగా అతను నిప్పులపై నడిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తన ట్రైనర్‌తో కలిసి ఉన్న నయీమ్.. చెప్పులు విప్పేసి, ప్యాంటు పైకి మడుచుకొని రెడీగా కనిపిస్తున్నాడు.
ఒక ఫుట్‌బాల్ మైదానంలో ఈ ఏర్పాట్లు చేసినట్లు కనిపిస్తోంది. నెమ్మదిగా ఈ నిప్పులపై నడిచిన నయీమ్.. అవతలి వైపు నేలపై వేసి ఉన్న గోనె సంచి మీదకు వెళ్లాడు. అక్కడ అతని కాళ్లపై నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్లందరూ నోరెళ్లబెడుతున్నారు. కొందరేమో వరల్డ్ కప్ కోసం ఈ తిప్పలు తప్పవని అంటున్నారు.
ఈసారి ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 30న పాకిస్తాన్, నేపాల్ మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. పాక్ గడ్డపై నాలుగు మ్యాచులు జరిగిన తర్వాత టోర్నీ పూర్తిగా శ్రీలంక షిఫ్ట్ అవుతుంది. అక్కడే భారత్ సహా మిగతా దేశాల మ్యాచులు జరుగుతాయి. సెప్టెంబర్ 17న కొలంబో వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది.