మహిళా క్రీడాకారులు ఎదుర్కొనే ఓ సున్నితమైన సమస్యపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ విజేత అలెక్స్ హార్ట్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడాప్రపంచంలో చర్చకు దారితీశాయి. మహిళా క్రీడాకారులు పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడటంపై ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మహిళలు తమ పీరియడ్స్ గురించి చర్చించడానికి అస్సలు భయపడకూడదని ఆమె పిలుపునిచ్చారు.
కామెంటరీ బాక్స్‌లో చర్చకు దారితీసిన ఘటన
ఇటీవల జరిగిన 'ఉమెన్ యాషెస్' సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్‌లో అలెక్స్ హార్ట్లీ కామెంటరీ చెబుతున్నారు. ఆ సమయంలో తనకు పీరియడ్స్ మొదలయ్యాయని, దాని వల్ల తను కొంత 'చిరాకుగా' అనిపిస్తోందని ఆమె సరదాగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆమెను విమర్శించగా.. వేల సంఖ్యలో మహిళలు, యువతులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక నిషిద్ధ అంశంగా భావించే పీరియడ్స్ గురించి ఇంత ధైర్యంగా మాట్లాడినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

క్రీడల్లో పీరియడ్స్ - ఒక అడ్డంకి?
అలెక్స్ హార్ట్లీ తన 'నో బాల్స్ పోడ్‌కాస్ట్'లో మాట్లాడుతూ కొన్ని దిగ్భ్రాంతికర విషయాలను పంచుకున్నారు. పీరియడ్స్ సమయంలో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడకూడదని తనను అడ్డుకున్నారని ఓ భారతీయ యువతి పంపిన మెసేజ్‌ను ఆమె గుర్తు చేసుకున్నారు. బ్రిటీష్ క్యాంపెయిన్ నివేదిక ప్రకారం.. 64 శాతం మంది స్కూల్ అమ్మాయిలు పీరియడ్స్ నొప్పి, సిగ్గు కారణంగా తమ క్రీడా జీవితాన్ని మధ్యలోనే వదిలేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
టెస్ట్ క్రికెట్‌లో టెన్షన్
ముఖ్యంగా మహిళా క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్‌ల్లో తెల్లటి దుస్తులు ధరించడం వల్ల పీరియడ్స్ సమయంలో తీవ్రమై ఒత్తిడికి లోనవుతారని అలెక్స్ హార్ట్లీ వివరించారు. దుస్తులపై మరకలు పడతాయేమో అన్న భయంతో కొందరు క్రీడాకారిణులు పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి మందులు వాడుతుంటారని సహచర బౌలర్ కేట్ క్రాస్ కూడా అంగీకరించారు. 13 ఏళ్ల వయసులో క్లబ్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు తనకు మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పటి భయంకరమైన అనుభవాన్ని అలెక్స్ హార్ట్లీ గుర్తు చేసుకున్నారు.
ఎవరీ అలెక్స్ హార్ట్లీ?
అలెక్స్ హార్ట్లీ ఇంగ్లాండ్ తరఫున 28 వన్డేలు, 4 టీ20లు ఆడారు. 2017 జులై 23న భారత్‌తో జరిగిన ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.