విరాట్ కోహ్లీ పరిచయం అక్కర్లేని పేరు. విరాట్ ఇంటర్ నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టి నేటికి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 16 ఏళ్ల కాలంలో అతను ఎన్నో ఘనతలు సాధించాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో తన 19వ ఏట ఆగస్టు 18, 2008న శ్రీలంకపై అరంగేట్రం చేశాడు. అతని అరంగేట్రం ప్రదర్శన సాధారణంగానే ఉంది. ఈ మ్యాచ్ లో అతను కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఇది అద్భుతమైన ప్రయాణానికి నాంది పలికింది.
వన్డేల్లో కోహ్లీ తన నిలకడతో త్వరగానే జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు. తన తొలి వన్డే సెంచరీని 2009లో శ్రీలంకపై సాధించాడు. అలాగే అత్యంత వేగంగా 8,000, 9,000, 10,000, 11,000, 12,000 పరుగులు చేశాడు. ODIలలో అత్యంత వేగంగా ఈ మైలురాళ్లను చేరుకున్న రికార్డును కోహ్లీ పేరిట ఉంది. విరాట్ కోహ్లీ 2011 లో వెస్టిండీస్‌పై తన టెస్టు అరంగేట్రం చేశాడు. త్వరలోనే జట్టులో ప్రధాన సభ్యుల్లో ఒకడిగా నిలిచాడు.

2012లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై కోహ్లి తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు. కోహ్లీ టెస్ట్ కెరీర్ లో ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డును సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ 2010లో టీ20 జింబాబ్వే పై అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గా, టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో కోహ్లీ ఒకడిగా నిలిచాడు. 2016 సీజన్‌లో 973 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్ గా భారత జట్టుకు సేవలు అందించాడు. టెస్ట్ కెప్టెన్సీ 2014 నుంచి 2022 వరకు నిర్వహించాడు. 2014లో టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన కోహ్లి 2018-19 సీజన్‌లో ఆస్ట్రేలియాలో వారి మొట్టమొదటి సిరీస్ విజయంతో సహా అనేక చారిత్రాత్మక సిరీస్ విజయాలను అందించాడు. 2017 నుంచి 2021 వరకు వన్డే, టీ20 లకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించాడు. 2017లో ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. 2019 ప్రపంచ కప్‌లో ఇండియా సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.
కోహ్లీ కెరీర్ అనేక ICC అవార్డులు ఉన్నాయి. 2017, 2018లో ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రతిష్టాత్మకమైన సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని గెలుచుకున్నాడు. కోహ్లీ ఇతర క్రికెటర్ల కంటే వేగంగా 70 అంతర్జాతీయ సెంచరీల మైలురాయిని చేరుకున్నాడు.