
ఒక్క క్రికెట్ అనే కాదు.. ఏ రంగంలో అయినా మరీ పాపులర్ అయినా కూడా కష్టాలు తప్పవు. అదే సినిమాలు, క్రికెట్ వంటి రంగాల్లో అయితే ఫ్యాన్స్ చుట్టుముట్టడం వల్ల సెలెబ్రిటీలకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అయిపోతుంటుంది. ఇలాంటి ఘటనే బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబల్ హసన్‌కు ఎదురైంది. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు షకీబల్ హసన్ వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొచ్చే సమయంలో అతన్ని ఫ్యాన్స్ చుట్టుముట్టేశారు. తమ అభిమాన క్రికెటర్‌తో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.
వాళ్లు ఎంత హడావుడి చేశారంటే షకీబల్ హసన్ కానీ, అతనితో పాటు ఉన్న మరికొందరు కానీ ఈ అభిమానుల తాకిడిని తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే కొందరైతే మరో అడుగు ముందుకేసి హసన్ చొక్క పట్టుకొని లాగేశారు. బలవంతంగా తమ దగ్గరకు లాక్కొని ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో షసన్ దాదాపు కింద పడినంత పనైంది. ఎలాగోలా బ్యాలెన్స్ నిలుపుకున్న అతను అక్కడి నుంచి తప్పించుకొని కారు ఎక్కేశాడు. ఈ సమయంలో అతని చుట్టూ బాడీగార్డులు లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
ఎప్పుడూ చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు పడిపోయే హసన్.. ఇంత జరిగినా అభిమానులపై కోప్పడకపోవడం చూసి కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఇలాగే అభిమానులు చుట్టుముట్టినప్పుడు హసన్ కోపంతో రెచ్చిపోయాడు. ఒక ఫ్యాన్‌ను తలపై తన టోపీతో టపటపా బాదాడు. ఈ గొడవ మరింత పెద్దది అవ్వకముందే సెక్యూరిటీ వాళ్లు కల్పించుకొని హసన్‌ను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా తాజాగా విశ్వవిజేత ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.