కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని, ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తమ జట్టు కోల్‌కతాతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కితాబిచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)8లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో బెంగళూరు చేతిలో కోల్‌కతా ఓడిపోయింది.
ఈ సందర్భంగా షారుక్ ఖాన్.. కోల్‌కతా, బెంగళూరు జట్ల ప్రదర్శనకు కితాబిచ్చారు. ఇరు జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
బెంగళూరు జట్టు బాగా ఆడిందని, అలాగే తమ జట్టు (కోల్‌కతా) కూడా బాగా ఆడిందని షారుక్ ట్వీట్ చేశారు. గెలిచిన రాయల్ ఛాలెంజర్స్‌కు శుభాకాంక్షలు చెబుతూ.. మనం మళ్లీ బెంగళూరులో కలుద్దామని పేర్కొన్నారు. కోల్‌కతాను మిస్సయ్యానని రాశారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాటు క్రిస్ గేల్ దూకుడైన ఆటతో బెంగళూరు.. కోల్‌కతా నైట్ రైడర్స్ పైన మూడు వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. గేల్ 56 బంతుల్లో 96 పరుగులు చేశారు. బెంగళూరు జట్టులో మిగతా ఏ ఆటగాడు కూడా అంతగా ఆడలేదనే చెప్పవచ్చు. గేల్ ఒంటిచేత్తో గెలిపించాడు.

కాగా, శనివారం నాడు షారుక్ ఖాన్ తన జట్టైన కోల్‌కతాకు చీర్స్ చెప్పేందుకు ఈడెన్ గార్డెన్‌కు రాలేదు. షారుక్ ఖాన్ అంతకుముందే ఫిక్స్ అయిన పని ఉండటం వల్ల రాలేకపోయారని సమాచారం.