చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని తన వాటాను మాజీ క్రికెటర్ల ట్రస్టుకు బదిలీ చేసేందుకు శ్రీనివాసన్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా విమర్శకులకు చెక్ పెట్టాలని భావిస్తున్నారని అంటున్నారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఐపిఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌లో తనకు ఉన్న 29 శాతం వాటాలను ఇండియా సిమెంట్స్‌కు అనుబంధంగా ఉన్న క్రికెటర్ల ట్రస్టుకు శ్రీనివాసన్ బదిలీ చేశాడు.
ఇండియా సిమెంట్స్‌కు అతను యజమాని. అంటే, అధికారికంగా చెన్నై నుంచి వైదొలగినప్పటికీ, పరోక్షంగా అతను ఫ్రాంచైజీపై పట్టును కొనసాగిస్తాడు. చెన్నై ఫ్రాంచైజీకి శ్రీనివాసన్ ప్రస్తుతం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆరో ఐపీఎల్‌లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఉదంతాలపై కోర్టుల్లో పలు కేసులు కొనసాగాయి. చివరికి వివాదం సుప్రీం కోర్టుకు చేరగా, ఆ వ్యవహారంలో శ్రీనివాసన్‌కు క్లీన్‌చిట్ లభించింది.

అయితే, చెన్నై ఫ్రాంచైజీని లేదా బీసీసీఐ అధ్యక్ష పదవుల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీనివాసన్ పోటీ చేయలేదు. జగ్మోహన్ దాల్మియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
ఐసీసీ చైర్మన్ పదవి ఇప్పుడు బీసీసీఐ చేతిలో ఉండడంతో అధ్యక్షుడు మారిన నేపథ్యంలో శ్రీనివాసన్ పదవికి ఎసరు తప్పదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. అందుకే అతను ముందు జాగ్రత్త చర్యగా చెన్నై ఫ్రాంచైజీలో తన వాటాలను క్రికెటర్ల ట్రస్టుకు బదిలీ చేశాడు. ఆ ట్రస్టు తాను యజమానిగా వ్యవహరిస్తున్న ఇండియా సిమెంట్స్ ఏర్పాటు చేసిందే. తద్వారా అధికారికంగా చెన్నైకి గుడ్ బై చెప్పి, విమర్శకులకు చెక్ పెట్టాలని భావిస్తున్నాడు.