వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు రేసు ఆసక్తికరంగా సాగుతోంది. పాకిస్థాన్‌పై ఘన విజయంతో బంగ్లాదేశ్ టాప్-4లోకి దూసుకొచ్చి రేసును రసవత్తరంగా మార్చింది. తాజాగా తుదిపోరు అర్హత పోటీని శ్రీలంక మరింత ఉత్కంఠగా మార్చింది. ఇంగ్లండ్‌పై లంక విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు తారుమారయ్యాయి.
ఓవల్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గి టెస్టు సిరీస్‌ను శ్రీలంక 1-2తో ముగించింది. అయితే ఈ ఓటమితో ఇంగ్లండ్ ఆరో స్థానానికి పడిపోయింది. శ్రీలంక అయిదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు లంక విజయం భారత్‌కు కలిసొచ్చింది. ఫైనల్ బెర్తుకు టీమిండియా అవకాశాలు మరింత మెరుగుపర్చుకుంది.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల టేబుల్‌లో ప్రస్తుతం భారత్ (68.52 %) అగ్రస్థానంలో ఉంది. ఇక ఆస్ట్రేలియా (62.50 %), న్యూజిలాండ్ (50 %) టాప్-3లో ఉన్నాయి. అయితే లంక విజయంతో సౌతాఫ్రికా (38.89 %), పాకిస్థాన్ (19.05 %), వెస్టిండీస్ (18.52 %) ఫైనల్ రేసు నుంచి దాదాపు దూరమయ్యాయి. ఇక ప్రమాదకర ఇంగ్లండ్ (42.19 %)కు కూడా ప్రతికూలాంశంగా మారింది.
ఈ నెలలో శ్రీలంక తమ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను లంక గెలిచినా, డ్రా చేసినా కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. ఎందుకంటే అక్టోబర్‌లో భారత్‌తో కివీస్ టెస్టు సిరీస్ ఆడనుంది. భారత గడ్డపై రోహిత్ సేనను ఓడించడం కష్టమే. దీంతో న్యూజిలాండ్ కూడా క్రమంగా ఫైనల్ రేసు నుంచి ఔట్ అవుతుంది. ఇక మిగిలింది భారత్‌తో పాటు ఆస్ట్రేలియా మాత్రమే.
నవంబర్ నుంచి భారత్ -ఆస్ట్రేలియా అయిదు టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ విజయం సాధిస్తే దర్జాగా ఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ ఓడినా రెండో స్థానంతో తుది పోరుకు టీమిండియా వెళ్లడం దాదాపు ఖాయమే. అయితే ఇదంతా న్యూజిలాండ్‌పై శ్రీలంక పోరాడే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌ను ఓడించి భారత్‌కు రూట్ క్లియర్ చేసిన లంక కివీస్‌పై కూడా గెలిస్తే.. టీమిండియా ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లడం ఖాయం!